ఆర్థిక వృద్ధిపై సీఈవోల్లో సానుకూల ధోరణి 

27 Feb, 2023 04:58 IST|Sakshi

అధిక వృద్ధి పట్ల అంచనాలు 

ఆర్థర్‌ డి లిటిల్‌ సంస్థ అధ్యయనం

ముంబై: స్థూల ఆర్థిక సవాళ్లు, అనిశ్చితులు వేధిస్తున్నప్పటికీ.. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని మెజారిటీ సీఈవోలు భావిస్తున్నారు. ఆర్థర్‌ డి లిటిల్‌ సంస్థ ఇందుకు సంబంధించి ‘2023 సీఈవో ఇన్‌సైట్స్‌ రీసెర్చ్‌’ పేరుతో ఓ అధ్యయనం నిర్వహించింది. వృద్ధి పట్ల సానుకూల అంచనాలతో ఉన్న సీఈవోల్లో సగం మంది తాము కొత్త ప్రాంతాల్లోకి వ్యాపార విస్తరణ చేస్తామని చెప్పారు.

30 శాతం సీఈవోలు మార్కెట్‌ కంటే వేగవంతమైన వృద్ధిని చూస్తామని పేర్కొన్నారు. వార్షిక అమ్మకాలు కనీసం బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్న 250 కంపెనీల సీఈవోల అభిప్రాయాలను ఈ అధ్యయనం కోసం తెలుసుకున్నారు. సర్వేలో పాల్గొన్న భారత సీఈవోల్లో 33 శాతం మంది.. వచ్చే 3–5 ఏళ్ల ఆర్థిక వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా ఇలా చెప్పిన సీఈవోలు 22 శాతంగా ఉన్నారు.

ప్రస్తుత ఆర్థిక అనిశ్చితుల్లోనూ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈవోలు సానుకూల దృక్పథంతో ఉన్నారు. వచ్చే 3–5 ఏళ్లపాటు సానుకూల వృద్ధి ఉంటుందని చెప్పిన సీఈవోల్లో నార్త్‌ అమెరికాలో పావు శాతం, ఆసియాలో 10 శాతం, యూరప్‌లో 38 శాతం చొప్పున ఉన్నారు. అధిక వ్యయాలు చేసేందుకు 60 శాతం మంది భారత సీఈవోలు సానుకూలంగా ఉంటే, వృద్ధి అంచనాలకు తగ్గట్టు వ్యయాలు చేస్తామని 33 శాతం మంది చెప్పారు.

మార్కెట్‌ కంటే అధిక వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 75 శాతం భారత సీఈవోలు ఉన్నారు. వృద్ధి కోసం పెట్టుబడులకు సైతం సుముఖంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వృద్ధి పట్ల భారత సీఈవోల్లో ఎక్కువ ఆశాభావం ఉన్నట్టు ఆర్థర్‌ డి లిటిల్‌ ఎండీ బర్నిక్ చిత్రన్‌ మైత్ర తెలిపారు.

మరిన్ని వార్తలు