ఆర్థిక గణాంకాల లాభాలు

14 Jul, 2021 00:20 IST|Sakshi

ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు 

సెన్సెక్స్‌ లాభం 397 పాయింట్లు 

మే 31 తర్వాత అతి పెద్ద లాభం 

నిఫ్టీ 15,800పైన ముగింపు 

రాణించిన బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు

ముంబై: సానుకూల ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు స్టాక్‌ మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవ్వడం కూడా కలిసిరావడంతో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా 397 పాయింట్లు పెరిగి 52,769 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో మూడురోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. అలాగే మే 31 తర్వాత ఈ సూచీ ఒకరోజులో అత్యధిక లాభాలను గడించింది. మరో సూచీ నిఫ్టీ 120 పాయింట్లు ఎగసి 15,812 వద్ద నిలిచింది. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడం సూచీలకు అధిక లాభాలొచ్చాయి. లార్జ్‌ క్యాప్‌తో పాటు అధిక నాణ్యత కలిగిన మిడ్‌క్యాప్‌ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కంపెనీ క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)కు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌ 30 షేర్లలో తొమ్మిది షేర్లు నష్టపోగా, మిగిలిన షేర్లన్నీ లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.114 కోట్ల షేర్లను., దేశీయ ఇన్వెస్టర్లు రూ.344 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ తొమ్మిది పైసలు బలహీనపడి 74.49 వద్ద స్థిరపడింది. ‘‘మార్కెట్లో బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. పతనాన్ని నాణ్యమైన షేర్ల కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీ 15,750 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,915 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ బినోద్‌ మోదీ తెలిపారు.   

ఇంట్రాడేలో స్థిరమైన కొనుగోళ్లు... 
ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 322 పాయింట్ల లాభంతో 52,695 వద్ద మొదలైంది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 15,794 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ లాభాల ప్రారంభం నేపథ్యంలో తొలుత కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్‌ 434 పాయింట్లు ర్యాలీ చేసి 52,807 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 15,821 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.

లాభాలు ఎందుకంటే...  
ఆర్థిక గణాంకాల ఉత్సాహం: ఈ ఏడాది మేలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే మేలో ఐఐపీ గణాంకాలు 33.4 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. అలాగే రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే జూన్‌లో దిగివచ్చింది. సమీక్షించిన నెలలో 6.26%గా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడం, పారిశ్రామికోత్పత్తి ఊపందుకోవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడింది. 

ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు: ఆసియాలో ఒక్క ఇండోనేషియా తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన స్టాక్‌ మార్కెట్లు్ల లాభాలతో ముగిశాయి. చైనా మెరుగైన ఆర్థిక గణాంకాలను ప్రకటించడంతో పాటు అక్కడి టెక్నాలజీ కంపెనీలు రాణించడంతో ఆసియా మార్కెట్లు రాణించాయి. రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో యూరప్‌తో పాటు యూఎస్‌ మార్కెట్లు జీవితకాల సరికొత్త రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. 

మరిన్ని వార్తలు