ఐటీ పరిశ్రమకు వై2కే తరహా అవకాశం

30 Sep, 2021 04:17 IST|Sakshi

భారీ అవకాశాలను సొంతం చేసుకోవాలి

నైపుణ్యాలకు పెద్ద పీట వేయాలి

కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ: కరోనా తర్వాతి ప్రపంచం భారత ఐటీ పరిశ్రమకు వై2కే తరహా సందర్భం వంటిదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు, భారీ అవకాశాలను సొంతం చేసుకునేందుకు పరిశ్రమ ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ 2021’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నైపుణ్యాలపై ఐటీ పరిశ్రమ మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని చంద్రశేఖర్‌ ప్రస్తావించారు. తగినంత పని లేదని కొన్నేళ్ల క్రితం చెప్పిన కంపెనీలే.. ఇప్పుడు విదేశాల్లో నియామకాలు చేపడుతూ పెద్ద ఎత్తున నైపుణ్య వనరులను నిలుపుకుంటున్నట్టు తెలియజేశారు.

‘‘ప్రపంచం ఎంతగానో మారిపోయింది. డిజిటైజేషన్‌ ఆకాశామే హద్దుగా కొనసాగుతోంది. కనుక డిటిజైషన్‌కు, నైపుణ్యాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. మనం కరోనా తర్వాతి ప్రపంచంలో ఉన్నామని గుర్తించాలి. భారత ఐటీ పరిశ్రమకు ఇది వై2కే తరహా సందర్భం’’ అని చంద్రశేఖర్‌ అన్నారు. అవకాశాలను వెంటనే సొంతం చేసుకోలేకపోతే మరొకరు వీటిని తన్నుకుపోయే అవకాశం ఉంటుందన్నారు. ‘‘పరిశ్రమ, పరిశ్రమ సంఘాలు ముందుకు రావాలి. నైపుణ్య శిక్షణ, నెట్‌వర్క్‌ విస్తరణకు నూరు శాతం కష్టించి పనిచేయాలి’’ అని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో, యూనికార్న్‌ల ఏర్పాటులో ఫిన్‌టెక్‌ కంపెనీల (టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల కంపెనీలు) పాత్రను ఆయన ప్రస్తావించారు. ప్లాట్‌ఫామ్‌ల ఆధారిత పరిష్కారాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయని ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు