పోస్ట్‌ ఇన్ఫో యాప్‌.. క్షణాల్లో డిజిటల్‌ సేవలు

21 May, 2022 21:20 IST|Sakshi

హైటెక్‌ తపాలా.. మొబైల్‌ యాప్‌తో మరిన్ని సదుపాయాలు 

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తోంది. కేవలం ఉత్తరాల బట్వాడా లాంటి సేవలకే పరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాలా శాఖ.. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సేవనూ తామూ అందిస్తామని సగర్వంగా ప్రచారం చేస్తోంది. 

ఆధార్‌ కార్డు నమోదు, సవరణలు, పాస్‌పోర్టు దరఖాస్తు తదితర ఎన్నో సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువ అవుతోంది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్, సేవింగ్స్‌ డిపాజిట్ల సేకరణలో కూడా వినూత్న పంథా అనుసరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింటా తానూ ఉన్నానని చాటిచెబుతోంది. త్వరితగతిన సమాచారం నిమిత్తం ఇప్పుడు ప్రజలంతా మొబైల్‌ ఫోన్ల మీదనే ఆధార పడుతున్నారు. అన్ని రకాల సేవలు ఫోన్ల ద్వారా సులభంగా పొందుతున్నారు. 

ఈ నేపథ్యంలో తపాలా శాఖ కూడా మొబైల్‌ యాప్‌ ‘పోస్ట్‌ ఇన్ఫో’ తీసుకొచ్చింది. పోటీ ప్రపంచంలో బ్యాంకులు, ఇతర సేవలందించే వివిధ సంస్థలకు దీటుగా ఈ యాప్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా తొమ్మిది రకాల సేవలు పొందే సౌకర్యం ఉంది. ప్రీమియం, వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ లెక్కలు సైతం వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పటికే పోస్ట్‌ బ్యాంక్‌ యాప్‌ వినియోగంలో ఉంది. పలు రకాల సేవలు అందించే తపాలా శాఖ ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది.  

యాప్‌లో ఫీచర్స్‌ ఇవే.. 
సుకన్య సమృద్ధి యోజన పథకం 
రికరింగ్‌ డిపాజిట్‌ పథకం. టైం డిపాజిట్‌లో ఏడాది నుంచి ఐదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. 

ఇంట్రస్ట్‌ కాలిక్యులేటర్‌  
ఏ డిపాజిట్‌ పథకంలో ఎంత సొమ్ము కడితే ఎంత మొత్తం తిరిగి పొందవచ్చు. దానికి సంబంధించిన వివిధ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. 

ఆర్టికల్‌ ట్రాకింగ్‌ 
వినియోగదారులు పంపిన స్పీడ్‌ పోస్టు, రిజిస్టర్‌ పోస్టు, పార్శిల్, ఈఎంవో ఎక్కడ ఉన్నాయి. అవతలి వ్యక్తులకు ఎప్పుడు చేరుతుందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. 

సర్వీస్‌ రిక్వెస్ట్‌ 
ఇంటి వద్ద సేవలు పొందేందుకు, డోర్‌ డెలివరీ వంటి సదుపాయాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. 

కంప్లైంట్స్‌ ట్రాకింగ్‌ 
వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఇంకా ఏమైనా కావాలా అనే అంశాలు తెలుస్తాయి.  

ఇన్సూరెన్స్‌ పోర్టల్‌ 
తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. 

ఫీడ్‌ బ్యాక్‌ 
పోస్టల్‌ సేవలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వివరంగా తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. 

పోస్టేజ్‌ కాలిక్యులేటర్‌ 
వినియోగదారులు పంపించే పార్సిళ్లు, పోస్టల్‌ కవర్లు, ధరలు, ఎంత బరువుకు ఎంత చెల్లించాలి. సాధారణ, స్పీడ్‌ పోస్టులో పంపితే ఎంత ఖర్చు అవుతుంది. అన్న విషయాన్ని చాలా సులభంగా, స్పష్టంగా తెలుసు కోవచ్చు.  

పోస్టల్‌ ఆఫీస్‌ సెర్చ్‌ 
దేశంలో ఏ పిన్‌ కోడ్‌ అయినా తెలుసుకోవచ్చు. ఊరి పేరు నమోదు చేయగానే సంబంధిత పిన్‌కోడ్‌ వస్తుంది. పిన్‌కోడ్‌ నంబర్‌ తెలిస్తే డెలివరీ కావాల్సిన పోస్ట్‌ ఆఫీసు ఎక్కడ ఉంది. ఏ తపాలా ప్రధాన కార్యాలయం పరిధిలో ఉందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు.  

యాప్‌తో ఉపయోగాలు 
పోస్ట్‌ ఇన్ఫో యాప్‌తో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి అందుతాయి. మొబైల్‌ ఫోన్ల ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నాం. తపాలా వినియోగదారులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవడం ద్వారా కొత్త సేవలు పొందవచ్చు. 
– సోమశేఖరరావు, సీనియర్‌ సూపరింటెండెంట్, తపాలాశాఖ, విశాఖ 

మరిన్ని వార్తలు