బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి పోస్టాఫీస్‌ బ్యాంక్‌

4 Jan, 2021 16:42 IST|Sakshi

ఏప్రిల్‌కల్లా ఇతర బ్యాంకులతో అనుసంధానం!

ఇతర బ్యాంక్‌ ఖాతాలతో కలసి పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ ఖాతా నిర్వహణ

ఈ ఏడాదిలో అన్ని సర్వీసులూ డిజిటలైజేషన్‌

పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌లో 50 కోట్లమంది ఖాతాదారులు

డాక్‌పే మొబైల్‌ యాప్‌ ద్వారా పీవోఎస్‌బీ పథకాల నిర్వహణ

ముంబై, సాక్షి: సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టల్‌ శాఖ 2020లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. కోవిడ్‌-19 తలెత్తడంతో దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌లు అమలయ్యాయి. ఈ సమయంలో వైమానిక, రైల్వే, రోడ్డు రవాణా దాదాపుగా నిలిచిపోయినప్పటికీ పోస్టల్‌ శాఖ పలు సర్వీసులు అందించింది. ప్రధానంగా మెడికల్‌ తదితర కీలకమైన పార్సిల్‌ డెలివరీలలో ముందు నిలిచింది. లాక్‌డవున్‌ సమయంలో 10 లక్షల మెడికల్‌ ఆర్టికల్స్‌ను డెలివరీ చేసింది. వీటిలో మెడికల్‌ పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఔషధాలున్నాయి. ఈ బాటలో పార్సిల్‌ హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని 2020 డిసెంబర్‌కల్లా వార్షికంగా 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచుకుంది. కాగా..  ఈ ఏడాది(20201) ఏప్రిల్‌కల్లా పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌.. దేశంలోని ఇతర బ్యాంకు ఖాతాలతో కలసికట్టుగా నిర్వహించేందుకు వీలు కలగవచ్చని పీఎస్‌యూ దిగ్గజం ఇండియా పోస్ట్‌ భావిస్తోంది. ఇందుకు వీలుగా ఇటీవల పలు సర్వీసులను డిజిటైజేషన్‌ బాట పట్టించిన పోస్టల్‌ శాఖ 2021లో అన్ని సర్వీసులనూ ఆన్‌లైన్‌ చేయాలని భావిస్తోంది.  (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్‌)

50 కోట్ల ఖాతాలు
పోస్ట్‌ ఆఫీస్‌కు కీలకమైన బ్యాంకింగ్‌ సొల్యూషన్‌(సీబీఎస్‌) ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు పోస్టల్‌ శాఖ సెక్రటరీ ప్రదీప్త కుమార్‌ తాజాగా పేర్కొన్నారు. 23,483 పోస్టాఫీసులు ఇప్పటికే ఈ నెట్‌వర్క్‌ పరిధిలోకి చేరినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్టాఫీసులున్నాయి. వీటి ద్వారా పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌లో 50 కోట్లమందికి ఖాతాలున్నాయి. పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లావాదేవీల నిర్వహణకు 1.36 లక్షల యాక్సెస్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోనూ ఇంటివద్దనే బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది. (4 నెలల గరిష్టానికి రూపాయి)

పలు పథకాలు
పోస్టాఫీస్‌ పొదుపు పథకాలలో భాగంగా సేవింగ్స్‌ ఖాతా, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌‌, సుకన్య సమృద్ధి(ఎస్‌ఎస్‌వై), నేషనల్‌ సేవింగ్(ఎన్‌ఎస్‌సీ)‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ తదితరాలను అందిస్తున్న విషయం విదితమే. ఈ పథకాల కింద రూ. 10,81,293 కోట్ల ఔట్‌స్టాండింగ్‌ బ్యాలన్స్‌ను కలిగి ఉంది. సీబీఎస్‌ ద్వారా 24 గంటలూ ఏటీఎం, ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌కు వీలు కల్పిస్తోంది. పీవోఎస్‌బీ పథకాలన్నిటినీ ఇండియా పోస్ట్‌ పేమెంట‍్స్‌ బ్యాంకుకు అనుసంధానించింది. దీంతో మొబైల్‌ యాప్‌ డాక్‌పే ద్వారా లావాదేవీల నిర్వహణకు వీలు కల్పించింది.

మొబైల్‌ యాప్‌
పోస్ట్‌మ్యాన్‌ మొబైల్‌ యాప్‌లో 1.47 పీవోఎస్‌లను భాగం చేసింది. తద్వారా 14 కోట్ల స్పీడ్‌ పోస్ట్‌, రిజిస్టర్డ్‌ పార్సిల్‌ ఆర్టికల్స్‌ స్టేటస్‌ను వాస్తవిక సమాయానుగుణంగా పరిశీలించేందుకు వీలు కల్పించింది. డాక్‌ఘర్‌ నిర్యత్‌ కేంద్ర పేరుతో ఈకామర్స్‌కూ మద్దతు పలుకుతోంది. తద్వారా ఎంఎస్‌ఎంఈ ప్రొడక్టుల ఎగుమతులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అంతేకాకుండా పోస్టల్‌ జీవిత బీమా, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ప్రత్యక్ష చెల్లింపులు తదితరాలలో గ్రామీణ ప్రాంతాలనూ డిజిటలైజేషన్‌లో భాగం చేస్తోంది.

మరిన్ని వార్తలు