Power Saving Tips: ఆఫ్‌ చేయడమే కాదు.. ఫ్లగ్‌ తొలగించడం బెటర్‌!

29 Jul, 2021 12:50 IST|Sakshi

టెక్‌ ఏజ్‌లో సాంకేతికతకు పవర్‌ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ..  నెల తిరిగే సరికి కరెంట్‌ బిల్లును చూసి కళ్లు  పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్‌ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్‌ చేసినప్పటికీ!. యస్‌.. మొత్తం పవర్‌ బిల్లులలో మినిమమ్‌ 1 శాతం.. పవర్‌ ఆఫ్‌ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్‌షెల్ఫ్‌ ఓ కథనం ప్రచురించింది. 

టెలివిజన్‌ సెట్స్‌.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్‌ ఆఫ్‌ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్‌ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!.
 

సెల్‌ఫోన్‌ ఛార్జర్‌.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్‌ ఛార్జింగ్‌ అయ్యాకో, మధ్యలో ఫోన్‌ కాల్‌ వస్తేనో స్విచ్ఛాఫ్‌ చేయకుండా ఫోన్‌ నుంచి పిన్‌ తీసేస్తుంటారు. కానీ, పవర్‌ బటన్‌ను ఆఫ్‌ చేయడమో, సాకెట్‌ నుంచి ఛార్జర్‌ను తీసేయడమో చేయరు. ఛార్జర్‌ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్‌ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. 

వైఫై మోడెమ్‌.. స్విచ్ఛాఫ్‌ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండేది ఇదే. ఇంటర్నెట్‌ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్‌లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్‌లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్‌ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్‌ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్‌.

మైక్రో ఓవెన్స్‌.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్‌ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్‌, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్‌ఫ్లగ్‌ చేయడం ఉత్తమం. 

మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్‌ మెషిన్స్‌, ఫ్రిడ్జ్‌(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్‌, మిక్సర్‌లు, గ్రైండర్‌లు, రైస్‌ కుక్కర్లు, టేబుల్‌ ఫ్యాన్‌లు, బ్లూటూత్‌ స్పీకర్‌లు ఆఫ్‌ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్‌ చేయడం మంచిది. వర్క్‌ ఫ్రమ్‌ హోంలో చాలామంది ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్‌ చేసినా అన్‌ఫ్లగ్‌ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్‌ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్‌సేవింగ్‌ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్‌ను ఆదా చేయడం, అప్లయన్సెస్‌ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు.

-సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు