సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే!

1 Jul, 2021 15:58 IST|Sakshi

చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి ఇంకా కొనసాగుతున్న కారణంగా 2021-22 రెండవ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్​ఎస్​పీ, కేవీపీ వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సెప్టెంబర్ 30 వరకు పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లు ఉంటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు వరుసగా ఐదు త్రైమాసికాలు(సెప్టెంబర్ 30, 2021వరకు) వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా అదేవిధంగా ఉంచింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో ఇలా ఉంది.. "ఈ ఆర్థిక సంవత్సరం జూలై 1, 2021 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30, 2021తో ముగిసే రెండవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు అనేవి మొదటి త్రైమాసికంలో(ఏప్రిల్ 1, 2021 నుంచి జూన్ 30, 2021) ఉన్న వడ్డీ రేట్లు మాదిరిగానే ఉండనున్నాయి" అని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం వడ్డీ రేటు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్​ఎస్​పీ)పై 6.8% వార్షిక వడ్డీ రేటు లభిస్తాయి. అలాగే నెలవారీ ఇన్​కమ్ అకౌంట్​పై 6.6 శాతం, సేవింగ్స్​ ఖాతాపై 4 శాతం ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై గత త్రైమాసికంలో ఉన్న వార్షిక వడ్డీ రేట్లే ఉంటాయి.

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు  - 7.1 శాతం 
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీరేటు - 6.8 శాతం
  • సుకన్య సమృద్ధి యోజన వడ్డీరేటు - 7.6 శాతం 
  • కిసాన్ వికాస్ పత్రా వడ్డీరేటు -  6.9 శాతం 
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్​పై వడ్డీ రేటు - 7.4 శాతం

చదవండి: గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్ 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు