Pre-Budget Meet: ప్రోత్సాహకాలు.. తక్కువ వడ్డీ రేటు కావాలి!

25 Nov, 2022 04:15 IST|Sakshi
ఎగుమతి సేవా రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి ప్రీ–బడ్జెట్‌ సమావేశ దృశ్యం

ఆర్థికమంత్రికి ఎగుమతిదారుల ప్రీ–బడ్జెట్‌ వినతులు  

న్యూఢిల్లీ: దేశం నుంచి ఎగుమతుల పురోగతికి అలా­­గే ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని ఎగుమతిదారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. అలాగే  కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలు తగ్గించాలని, తక్కువ వడ్డీరేటుకు రుణా­లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన 5వ ప్రీ–బడ్జెట్‌ రూపకల్పనపై  వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె గురువారం ఎగుమతి సంఘాలు,  సేవా రంగాల ప్రతినిధులతో వర్చువల్‌ సమావేశా­న్ని నిర్వహించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరిసహా ఆ శాఖ సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగు­మ­తి రంగం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తుల్లో ముఖ్యాంశాలు...

► డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత వల్ల ఎగుమతుల పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఎగుమతి సంఘాల భారత సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. భారత్‌ ఎగుమతుల విలువ  460–470 బిలియన్‌ డాలర్ల వరకూ పురోగమించేందుకు (2021–22లో 400 బిలియన్‌ డాలర్లు) మార్కెట్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (ఎండీఏ) కింద ప్రకటించిన రూ.200 కోట్లు సముద్రంలో నీటి బొట్టని కూడా సమాఖ్య పేర్కొంది.  ‘కాబట్టి, పటిష్ట ఎగుమతుల మార్కెటింగ్‌ కోసం, గత సంవత్సరం ఎగుమతుల విలువలో కనీసం 0.5 శాతం కార్పస్‌తో ఎగుమతి అభివృద్ధి నిధిని సృష్టించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది. అలాగే  సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల  ద్వారా ఎగుమతి చేసే వస్తువుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని బడ్జెట్‌లో ప్రవే­­శపెట్టవచ్చని సూచించింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), టీసీఎస్‌ (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) రద్దు ద్వారా విధానపరమైన సరళీకరణలు జరగాలని విజ్ఞప్తి చేసింది.  దేశీ మార్కెటింగ్‌ కోసం ఎగుమతిదారులు చేసే వ్యయాలపై 200 శాతం పన్ను మినహాయింపు కోరింది.  గ్లోబల్‌ ఇండియన్‌ షిప్పింగ్‌ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్‌ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించాలని సూచించింది.  ఎంఎస్‌ఎంఈకి పన్ను రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి  చేసింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ, విమానాశ్రయంలో విదేశీ పర్యాటకులకు పన్ను రిఫండ్‌ చేయాలని కోరింది. దీనివల్ల పర్యాటకం రంగం పురోగతితోపాటు  హస్తకళలు, తివాచీ­లు, ఖాదీ, తోలు వస్తువుల ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది.  

► వెట్‌ బ్లూ క్రస్ట్,  ఫినిష్డ్‌ లెదర్‌పై ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలని సమావేశంలో కౌన్సిల్‌ ఫర్‌ లెదర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (సీఎల్‌ఈ) డిమాండ్‌ చేసింది.  హ్యాండ్‌బ్యాగ్‌లు, వస్త్రాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఎగుమతిదారులు ప్రధానంగా ఇటువంటి తోలులను దిగుమతి చేసుకుంటారు. ఫినిష్డ్‌ లెదర్‌ డ్యూటీ–ఫ్రీ దిగుమతి తయారీదారుల పోటీ తత్వం మరింత మెరుగుపడ్డానికి ఈ చర్య దోహపదడుతుందని తెలిపింది.  

► ముడి సిల్క్, సిల్క్‌ నూలు (15 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం), ముడి పత్తి (సుంకం రహితం), రాగి ఖనిజాలు వంటి అనేక వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను సవరించాలని ఎగుమతిదారులు సూచించారు, భారతదేశ ఎగుమతులు ప్రతికూల భూభాగంలోకి ప్రవేశించాయి.  

► విస్తృత పన్ను రాయితీ ప్రయోజనాలతో డిమాండ్‌ను ప్రోత్సహించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కోరింది.  

► ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌ ఎ శక్తివేల్‌సహా విప్రో లిమిటెడ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేఈపీసీ), తమిళనాడు, కలకత్తా, ఉత్తర అస్సోంకు చెందిన ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌తో సహా పలు కంపెనీలు, వాణిజ్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు  ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు