రూ. 4.4 లక్షల కోట్లకు ప్రీ–ఓన్డ్‌ కార్ల మార్కెట్‌

30 Nov, 2022 06:27 IST|Sakshi

2022–27 మధ్య 16 శాతం అప్‌

కొత్త కార్ల మార్కెట్‌ వృద్ధి 10 శాతం

ఓఎల్‌ఎక్స్‌–క్రిసిల్‌ ఆటో నివేదికలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత కొన్నాళ్లుగా కొత్త కార్ల మార్కెట్‌ను మించి ప్రీ–ఓన్డ్‌ (సెకండ్‌ హ్యాండ్‌) కార్ల మార్కెట్‌ వృద్ధి చెందుతోంది. రాబోయే ఐదేళ్ల వ్యవధిలో (2022–27) ఇది వార్షికంగా 16 శాతం మేర పెరిగి రూ. 4.4 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఇదే వ్యవధిలో కొత్త కార్ల మార్కెట్‌ వృద్ధి వార్షికంగా 10 శాతంగానే ఉండనుంది. రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌లో ఓఎల్‌ఎక్స్‌ రూపొందించిన 6వ విడత ఓఎల్‌ఎక్స్‌ ఆటోస్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కోవిడ్‌ ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో లాక్‌డౌన్‌ల కారణంగా సరఫరా తగ్గి ప్రీ–ఓన్డ్‌ కార్ల మార్కెట్‌ కాస్త మందగించినా .. 2022 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ కోవిడ్‌–పూర్వ స్థాయికి చేరింది. కొనుగోలుదారుల సెంటిమెంట్‌ మెరుగపడుతుండటం, కార్యాలయాలు తెరుచుకోవడంతో ప్రయాణాలు పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రీ–ఓన్డ్‌ వాహనాల మార్కెట్‌ మరింత పుంజుకోగలదని ఓఎల్‌ఎక్స్‌ ఇండియా సీఈవో అమిత్‌ కుమార్‌ తెలిపారు.  మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో ప్రీ–ఓన్డ్‌ కార్ల విక్రయాలు విలువపరంగా 2.5 రెట్లు, పరిమాణంపరంగా రెండు రెట్లు పెరగనున్నట్లు పేర్కొన్నారు.  ప్రీ–ఓన్డ్‌ మార్కెట్లో చిన్న కార్ల ధరలు సగటున రూ. 2–4 లక్షలు, సెడాన్‌లు రూ. 5–6 లక్షలు, యూవీలు రూ. 7–9 లక్షల శ్రేణిలో ఉంటున్నాయి.  

యూవీలకు ప్రాధాన్యం..
నివేదిక ప్రకారం ప్రీ–ఓన్డ్‌ కార్ల అమ్మకాలు 2022 ఆర్థిక సంవత్సరంలో 41 లక్షలుగా ఉండగా 2027 నాటికి రెట్టింపై 82 లక్షలకు చేరనున్నాయి. అదే వ్యవధిలో కొత్త కార్ల విక్రయాలు 9–11 శాతం వృద్ధితో 48 – 50 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. మిగతా రకాలతో పోలిస్తే యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్‌ పెరుగుతోంది. ప్రీ–ఓన్డ్‌ కార్ల విభాగం తీసుకుంటే 2017–2022 మధ్య కాలంలో వీటి మార్కెట్‌ వాటా 17 శాతం నుండి 22 శాతానికి పెరిగింది. రాబోయే అయిదేళ్లలో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 32 శాతానికి చేరవచ్చని అంచనా. ఓఎల్‌ఎక్స్‌ ప్లాట్‌ఫాం డేటా ప్రకారం హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ బ్రెజా, మారుతీ ఎర్టిగా, మహీంద్రా ఎక్స్‌యూవీ 500లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. అటు కొత్త కార్ల విభాగంలోను యూవీల హవా కొనసాగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి 49 శాతం మార్కెట్‌ వాటాతో చిన్న కార్లు (45 శాతం), సెడాన్లను (3 శాతం) కూడా అధిగమించాయి.  

చిన్న కార్లు, సెడాన్‌ల తగ్గుదల..
ప్రీ–ఓన్డ్‌ విభాగంలోని మొత్తం కార్లలో 58 శాతం వాటాతో చిన్న కార్లదే ఆధిపత్యం ఉన్నప్పటికీ రాబోయే అయిదేళ్లలో ఇది స్వల్పంగా 2 శాతం తగ్గి 56 శాతానికి చేరవచ్చని అంచనా. ఈ విభాగంలో హ్యుందాయ్‌ ఎలీట్‌ ఐ20, రెనో క్విడ్, మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 మొదలైన వాటికి ఎక్కువగా ఆదరణ ఉంటోంది. మరోవైపు, సెడాన్‌ కార్ల విభాగం మార్కెట్‌ వాటా గణనీయంగా తగ్గనుంది. ఇది 12 శాతం నుండి 7 శాతానికి పడిపోవచ్చని అంచనా. కొత్త కార్ల మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు తగ్గుతుండటం, కొత్తగా వచ్చే మోడల్స్‌ తక్కువగా ఉంటుండటం, కస్టమర్లు యూవీలవైపు మొగ్గు చూపుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం కానున్నాయి. యూవీల్లోనూ కొత్త మోడల్స్‌ వచ్చే కొద్దీ పాతవాటిని చాలా వేగంగా మార్చేస్తున్నారు. దీంతో నిన్న, మొన్న ప్రవేశపెట్టినవి కూడా ప్రీ–ఓన్డ్‌ సెగ్మెంట్‌లోకి వచ్చేస్తున్నాయి. మిగతా కార్లకు కూడా ఇదే ధోరణి విస్తరిస్తోంది. దీంతో 2027 నాటికి ప్రీ–ఓన్డ్‌ మార్కెట్లో సగటు వయస్సు 0–7 ఏళ్ల స్థాయిలో ఉండే వాహనాల వాటా 58 శాతం పైగా ఉంటుందని, ఇప్పుడున్న స్థాయికి 2.2 రెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.   

నివేదికలో మరిన్ని విశేషాలు..
► ఎక్కువగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ప్రీ–ఓన్డ్‌ కార్లకు డిమాండ్‌ ఉంటోంది.
► మొత్తం కస్టమర్లలో తొలిసారి కొనుగోలు చేసే వారి వాటా 40–45 శాతంగా ఉంటోంది.
► మహిళా కొనుగోలుదారుల వాటా మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో 10 శాతంగాను, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో 5 శాతం లోపు ఉంటోంది.
► ట్రాఫిక్‌ కారణంగా మెట్రోల్లో ఎక్కువగా ఆటోమేటిక్‌ వెర్షన్లకు డిమాండ్‌ ఉంటోంది.

మరిన్ని వార్తలు