పెట్రోల్‌లో ఇథనాల్‌ మిక్సింగ్‌.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

19 Jul, 2021 12:21 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే లీటరు పెట్రోలు ధర వంద దాటింది. ఇప్పుడప్పుడే ధర తగ్గుతుందన్న నమ్మకం కూడా లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్ముతున్నారు. కొత్తగా వచ్చిన ఈ మార్పులకు అనుగుణంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

జులై 9 నుంచి
పెట్రోలు దిగుమతులు తగ్గించడంతో పాటు దేశీయంగా రైతులకు ఉపయోగపడేలా ఇథనాల్‌ వినియోగం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాబోయే ఐదేళ్లలో లీటరు పెట్రోలులో 20 శాతం ఇథనాల్‌ కలపాలంటూ ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. దీన్ని అనుసరించి జులై 9 నుంచి లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి బంకులు అమ్మకాలు సాగిస్తున్నాయి. సాధారణంగా పెట్రోలు, ఇథనాల్‌ కలపడం వల్ల ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. ఇంజన్‌పై పెద్దగా ప్రభావం చూపదు. వాహనం నడిపేప్ప్పుడు పెద్దగా తేడాలు కూడా రావు. అయితే వాహనంలో ఉన్న పెట్రోలు ట్యాంకు నిర్వహాణలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు.

నీటితో ఇబ్బందులు తప్పవు
పెట్రోలు, ఇథనాల్‌లను కలిపినా అవి రెండు వేర్వేరు లేయర్లుగానే ఉండి పోతాయి. నీరు పెట్రోలుతో కలవదు, కానీ ఇథనాల్, నీరు త్వరగా కలిసిపోతాయి. వర్షకాలంలో బైకులు బయట పెట్టినప్పుడు, లేదా వాటర్‌ సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు ఒక్క చుక్క నీరు పెట్రోలు ట్యాంకులోకి పోయినా సమస్యలు ఎదురవుతాయి. చిన్నీ నీటి బిందువు, తేమ ఉన్నా సరే ఇథనాల్‌ వాటితో కలిసి పోతుంది. నీరు, ఇథనాల్‌ కలిసి ప్రత్యేక పొరగా ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంజన్‌ అకస్మాత్తుగా ఆగిపోతుంది. హైవేలపై, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న చోట ఇలా జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. 

జాగ్రత్తలు
పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం 10కి చేరడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ పంప్‌ డీలర్‌ అసోసియేషన్లు అవగాహన కల్పిస్తున్నాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం మంచింది.
- పెట్రోలు పంప్‌ ట్యాంక్‌ మూతలను సరిగా పరిశీలించాలి. నీటి బిందువులు, తేమ లోపలికి వెళ్లకుండా గట్టిగా బిగించాలి
- వాటర్‌ సర్వీసింగ్‌ చేసేప్పుడు ట్యాంకులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
- వర్షంలో వాహనాలు ఆపినప్పుడు ట్యాంకుపై నీరు పడకుండా చూసుకోవాలి
- ప్రయాణం మధ్యలో వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుంటే వెంటనే మెకానిక్‌కి చూపించాలి
 

మరిన్ని వార్తలు