ఇళ్ల కొనుగోలులో జాగ్రత్తలు, హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయ్‌

26 Jun, 2021 10:43 IST|Sakshi

రంగం ఏదైనా సరే ప్రొఫెషనలిజం తప్పనిసరి. జీవితకాల కలను సాకారం చేసే గృహ నిర్మాణ రంగంలో అయితే మరీనూ. కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు, నిర్మాణం విషయంలో బిల్డర్లు.. ఇద్దరూ ప్రొఫెషనల్‌గా బిహేవ్‌ చేస్తేనే పరిశ్రమకు గుర్తింపు, గౌరవం దక్కుతాయి. మారుతున్న సామాజిక అవసరాలు, కస్టమర్ల అభిరుచులు, నగర అభివృద్ధికి సూచికలాంటి వినూత్న డిజైన్స్‌ మీద బిల్డర్లు ఫోకస్‌ చేస్తే.. భౌతిక, సామాజిక వసతుల అభివృద్ధి, బడ్జెట్, అఫర్డబులిటీ మీద కస్టమర్లు దృష్టి పెడితేనే ఇద్దరికీ సమాన విజయావకాశాలు వస్తాయి. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలుదారులు.. అమ్మేసి చేతులుదులుపుకుందామని బిల్డర్లు ఏమాత్రం తొందరపడినా ఇబ్బందులు తప్పవు! 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నేపథ్యంలో సాధ్యమైనంత తక్కువ భారం నుంచి బయటపడేందుకు డెవలపర్లు ఆచితూచి ప్రాజెక్ట్‌లను ప్లానింగ్‌ చేస్తున్నారు. కరోనాతో విక్రయాలు సరిగా లేకపోయినా ఆర్థికంగా చాలా తక్కువ మంది డెవలపర్లు తట్టుకునే స్థాయిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో గృహ కొనుగోళ్లలో కొనుగోలుదారులు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో లేదా కనీసం 30–40 శాతం నిర్మాణం పూర్తయిన వాటిల్లో కొనడం ఉత్తమం. లేకపోతే ఆర్థికంగా బిల్డర్‌కు ప్రతికూల పరిస్థితులు తలెత్తి చేతులెత్తేస్తే అంతే సంగతులు. ఇన్వెస్టర్లు, స్పెక్యులేటర్ల మాటలు నమ్మి తొందరపడి కొనుగోలు నిర్ణయం తీసుకోవద్దు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు ఇంకా కొన్నాళ్లు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక అవసరాలు తలెత్తితే ఇబ్బందులకు గురవుతారు. అందుకే ఆలోచించి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. రిస్క్‌ తీసుకోవద్దని ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌ సీఎండీ ఎస్‌ రాంరెడ్డి సూచించారు. 

యూడీఎస్‌లో కొని ఇబ్బందులు పడొద్దు!  

కోటి రూపాయల ప్రాపర్టీ రూ.40 లక్షలకే వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు. దీన్నే ఆసరాగా చేసుకొని కొందరు డెవలపర్లు అన్‌డివైడెడ్‌ షేర్‌ (యూడీఎస్‌) ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. బిల్డర్‌ ట్రాక్‌ రికార్డ్, ఆర్థిక స్థోమత ఇవేవీ గమనించకుండా కొనుగోలుదారులు గుడ్డిగా నమ్మి ముందుకెళితే.. అనుకోని విపత్కర పరిస్థితులొస్తే పరిస్థితేంటి? యూడీఎస్‌ స్కీమ్‌లో బిల్డర్‌కు, కస్టమర్‌కు మధ్యలో జరిగే అగ్రిమెంట్‌ విలువ రూ.2–5 లక్షలకు మించి ఉండదు. సగానికి పైగా సొమ్ము నగదు రూపంలో జరుగుతుంది. అగ్రిమెంట్‌లో ఇవేవీ పేర్కొనరు. ఒకవేళ బిల్డర్‌ చేతులెత్తేస్తే.. ఏ కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు.. మహా అయితే అగ్రిమెంట్‌లో రాసుకున్న సొమ్ముకు వడ్డీ కట్టమంటుంది కోర్ట్‌. మరి, బిల్డర్‌కు నగదు రూపంలో అప్పజెప్పిన సొమ్ము పరిస్థితేంటి? నిజమైన గృహ కొనుగోలుదారులు యూడీఎస్‌ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయరు. ఇన్వెస్టర్లు, స్పెక్యులేటర్స్‌ ఎక్కువగా కొంటుంటారు. నగరంలో యూడీఎస్‌ స్కీమ్‌ కింద సుమారు 15–20 వేల యూనిట్లు అమ్ముడుపోయాయని.. వీటి విలువ రూ.20–25 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. 10–15 కంపెనీలు శంకర్‌పల్లి, అమీన్‌పూర్, పటాన్‌చెరు, కోకాపేట ప్రాంతాలలో యూడీఎస్‌ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. 

నిర్మాణ వ్యయం పెరిగింది.. 


సిమెంట్, స్టీల్‌ వంటి నిర్మాణ సామగ్రి ధరలు 60 శాతానికి పైగా పెరిగిపోయాయి. నైపుణ్యమున్న నిర్మాణ కార్మికుల వ్యయం 30–40 శాతం వరకు పెరిగాయి. మొత్తంగా నిర్మాణ వ్యయం 25–30 శాతం వరకు పెరిగింది. గృహాల ధరలు మాత్రం గతేడాది మార్చిలో ఉన్నవే ఇప్పటికీ ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లలో, ఇన్వెంటరీ గృహాలు, స్టాక్స్‌లలో ధరలు చ.అ.కు రూ.500–700లు పెరిగాయి. ప్రొఫెషనల్‌ బిల్డర్లకు నిర్మాణ సామగ్రి ఆరు నెలల స్టాక్‌ ఉంటుంది. యూడీఎస్‌ బిల్డర్లకు మెటీరియల్‌ సప్లయి ప్రాబ్లం ఉంటుంది. రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలను యూడీఎస్‌ బిల్డర్లు నిర్వహణ చేయలేక.. ఆ భారాన్ని కస్టమర్ల మీదకి నెట్టేస్తారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి. 

కొనేముందు గమనించాల్సినవివే... 
బిల్డర్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఏంటి? గతంలో ఎన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాడో తెలుసుకోవాలి. 
నిర్మాణ సంస్థ విలువలేంటి? సాంకేతిక అనుభవం ఉందో లేదో చూడాలి. 
బిల్డర్, కంపెనీ ఆర్థిక పరిస్థితులేంటో ఆరా తీయాలి. 
ప్రాజెక్ట్‌లో సేల్స్‌ ఎలా ఉన్నాయి.. క్యాష్‌ఫ్లో ఎలా ఉంది కనుక్కోవాలి. బ్యాంక్‌ రుణాలు, కన్‌స్ట్రక్షన్‌ ఫండింగ్‌ వివరాలు అడగాలి. 
నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాడా? భవన నిర్మాణ నిబంధనలు తు.^è. తప్పకుండా ఫాలో అవుతున్నాడో లేదో పరిశీలించాలి. 
ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతంలో సోషల్‌ ఇన్‌ఫ్రా ఎలా ఉందో భౌతికంగా చూడాలి. 
ఎంపిక చేసిన ప్రాజెక్ట్‌ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. 

ఎక్కడ కొంటే బెటర్‌? 


రూ.50 లక్షల లోపు ధర ఉండే గృహాల కోసం ఉప్పల్, హయత్‌నగర్, నాగార్జునసాగర్‌ హైవే, ఆదిభట్ల వంటి ప్రాంతాలలో తీసుకోవచ్చు. 
రూ.50   లక్షల నుంచి కోటి రూపాయల మధ్య అయితే మియాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి, శంషాబాద్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు ప్రాంతాలలో చూడొచ్చు. 
రూ.కోటి పైన అయితే కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, అప్పా జంక్షన్‌ వంటి ప్రాంతాలలో కొనుగోలు చేయడం ఉత్తమం. 

స్టాండలోన్‌ టవర్స్‌లో కొనొద్దు.. 

కరోనా తర్వాతి నుంచి విశాలమైన గృహాలకు డిమాండ్‌ పెరిగింది. పరిమిత వసతులతో, తక్కువ విస్తీర్ణంలో నిట్టనిలువుగా నిర్మించే స్టాండలోన్‌ టవర్లలో కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే ఓపెన్‌ ప్లేస్‌ ఉండదు. కోవిడ్‌ థర్డ్‌ వేవ్, ఇతరత్రా కారణాలతో లాక్‌డౌన్‌ చేస్తే.. నాలుగు గోడల మధ్య నిర్బంధమవుతారు. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వాకింగ్, జాగింగ్‌ ట్రాక్స్, ఇతరత్రా వసతులతో గ్రీనరీ ఎక్కువగా ఉండే గేటెడ్‌ కమ్యూనిటీలలోనే కొనుగోలు చేయాలి. గాలి, వెలుతురు విశాలంగా వస్తుంది. అన్ని రకాల వసతులతో పాటు నిర్వహణ బాగుంటుంది. 

మరిన్ని వార్తలు