ప్రీమియం హోటళ్లకు డిమాండ్‌

24 Mar, 2023 03:51 IST|Sakshi

ఆదాయం 80 శాతం పెరగొచ్చు2023–24లో 15–20 శాతం వృద్ధి

క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌

ముంబై: ప్రీమియం హోటళ్లకు డిమాండ్‌ సానుకూలంగా ఉన్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదా యం 80 శాతం పెరుగుతుందని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15–20 శాతం మేర ఆదాయం పెరగొచ్చని అంచనా వేసింది. విహార, కార్పొరేట్, సమావేశాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ ప్రయాణాలతో హోటళ్ల బుకింగ్‌లు అధికంగా ఉన్నాయని, ప్రమీఇయం హోటళ్లకు దశాబ్దంలోనే గరిష్ట అక్యుపెన్సీకి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.

అధిక డిమాండ్, రూమ్‌ రేట్లు పెరగడం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇవన్నీ కలసి, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధిని నడిపిస్తాయని తెలిపింది. సగటు రూమ్‌ ధరలు కరోనా ముందు నాటి  స్థాయికి చేరాయని, ఆపరేటింగ్‌ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, రూమ్‌ల వారీ ఉద్యోగుల రేషియో తగ్గ డం ఇందుకు మద్దతుగా నిలుస్తోందని వివరించింది.  

రూమ్‌ ధరల పెరుగుదల
‘‘ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్‌ ధరలు (ఏపీఆర్‌) 2021–22లో 13 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19–21 శాతం మేర పెరిగి దశాబ్ద గరిష్ట స్థాయి అయిన రూ.7,500– 10,000కు చేరాయి. అక్యుపెన్సీ (రూముల భర్తీ) 2021–22లో 50 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశాబ్ద గరిష్టమైన 67–72 శాతానికి ఎగిసింది’’అని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ పుషన్‌ శర్మ తెలిపారు. అయితే, ప్రీమియం హోటళ్లకు డిమాండ్‌ పెరిగినప్పటికీ, విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి ఇంకా చేరుకోలేదని ఈ నివేదిక పేర్కొంది. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 54 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించడం గమనార్హం. కరోనా ముందున్న సంఖ్యతో పోలిస్తే ఇది 70 శాతమే.  

బడ్జెట్‌ హోటళ్లు..
బడ్జెట్‌ హోటళ్లలో సగటు రూమ్‌ ధరలు (ఏఆర్‌ఆర్‌) కరోనా ముందున్న నాటి కంటే 20 శాతం పెరిగినట్టు క్రిసిల్‌ నివేదిక తెలిపింది. ప్రీమియం హోటళ్ల వ్యాప్తంగా వృద్ధి రేటు ఒకే మాదిరిగా లేదని, విహార పర్యటనలకు సంబంధించి అక్యుపెన్సీ 70–75 శాతంగా ఉందని, అలా కాకుండా వ్యాపార పర్యటనల అక్యుపెన్సీ 65–70గా ఉన్నట్టు తెలిపింది. 2020–22 మధ్య హోటళ్లలో రూమ్‌ వారీ ఉద్యోగుల రేషియో 20–30 శాతానికి తగ్గినట్టు, డిమాండ్‌ పెరిగినప్పటికీ వ్యయాల సర్దుబాటును హోటళ్లు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది.   
 

మరిన్ని వార్తలు