Electric Vehicle: రెండేళ్లే! ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు దారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త!

4 Apr, 2022 07:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీలు) ప్రియులకు కేంద్ర మంత్రి గడ్కరీ తీపి కబురు చెప్పారు. రెండేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు పెట్రోల్‌ వాహన ధరల స్థాయికి వచ్చేస్తాయని ఆయన ప్రకటించారు. ఈ మేరకు లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. పార్లమెంటు ఆవరణలో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసిన తర్వాత సభ్యులు ఈవీలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. 

‘‘ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహన ధరలు పెట్రోల్‌ వాహన ధరలకే రెండేళ్లలో లభిస్తాయని సభ్యులు అందరికీ హామీ ఇస్తున్నాను’’ అని మంత్రి ప్రకటించారు. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా, కాలుష్య రహిత, దేశీయంగా ఉత్పత్తి చేయడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.

 

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావాలను చూస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వీటికి ప్రత్యామ్నాయం గ్రీన్‌ హైడ్రోజన్, విద్యుత్తు, ఇథనాల్, మెథనాల్, బయో డీజిల్, బయో ఎల్‌ఎన్‌జీ, బయో సీఎన్‌జీ అని పేర్కొన్నారు. పార్లమెంటు ఆవరణలో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అందించాలని స్పీకర్‌ ఓంబిర్లాను మంత్రి గడ్కరీ కోరారు.

చదవండి: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ లవర్స్‌కు శుభవార్త!

మరిన్ని వార్తలు