ప్రథమార్ధంలో పెట్టుబడుల జోరు!

21 Jul, 2022 07:15 IST|Sakshi

ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే 28 శాతం ఎగిసి 34.1 బిలియన్‌ డాలర్లకు చేరాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై .. ఇండియన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ అసోసియేషన్‌ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

2022 ప్రథమార్ధంలో 714 డీల్స్‌ కుదిరాయి. వీటిలో 92 ఒప్పందాల విలువ సుమారు 23.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వార్షికంగా చూస్తే పెరిగినప్పటికీ సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం పీఈ, వీసీ పెట్టుబడులు 32 శాతం తగ్గినట్లు ఈవై ఇండియా పార్ట్‌నర్‌ వివేక్‌ సోని తెలిపారు. గతేడాది ద్వితీయార్థంలో ఇవి 50.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

నివేదికలోని మరిన్ని అంశాలు.. 
కొత్త పెట్టుబడుల్లో అత్యధికంగా 54 శాతం వాటాను అంకుర సంస్థలే దక్కించుకున్నాయి. 506 డీల్స్‌ ద్వారా 13.3 బిలియన్‌ డాలర్లు అందుకున్నాయి. గతేడాది ప్రథమార్ధంలో 327 ఒప్పందాల ద్వారా వీటిలోకి 8.6 బిలియన్‌ డాలర్లు వచ్చాయి.  

♦ రంగాలవారీగా చూస్తే ఆర్థిక సేవల విభాగంలో అత్యధికంగా 152 డీల్స్‌ కుదిరాయి. వీటి విలువ 7.3 బిలియన్‌ డాలర్లు. చెరి 4 బిలియన్‌ డాలర్లతో ఈ–కామర్స్, టెక్నాలజీ రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ–కామర్స్‌లో 101 డీల్స్, టెక్నాలజీ రంగంలో 121 ఒప్పందాలు కుదిరాయి. ఈ–కామర్స్‌లోకి పెట్టుబడులు 16 శాతం, టెక్నాలజీలోకి 20 శాతం తగ్గాయి. 

మీడియా .. వినోదం, లాజిస్టిక్స్, విద్య రంగాలపై ఆసక్తి పెరిగింది. విద్యా రంగంలోకి 2.2 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. 42 డీల్స్‌ కుదిరాయి. 

ప్రథమార్ధంలో వార్షికంగా చూస్తే కుదిరిన ఒప్పందాలు 37 శాతం పెరిగాయి. 522 డీల్స్‌ నుంచి 714కి చేరాయి. అయితే, 2021 ద్వితీయార్థంతో పోలిస్తే 748 నుంచి 4 శాతం తగ్గాయి. 

92 భారీ ఒప్పందాలు (100 మిలియన్‌ డాలర్ల పైబడి) కుదిరాయి. వీటి విలువ 23.7 బిలియన్‌ డాలర్లు. గతేడాది ప్రథమార్ధంలో 19.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 70 డీల్స్‌ నమోదయ్యాయి. తాజాగా కుదిరిన ఒప్పందాల్లో వయాకామ్‌18లో బోధి ట్రీ 40 శాతం వాటాలు తీసుకోవడం (విలువ 1.8 బిలియన్‌ డాలర్లు), డైలీహంట్‌లో సుమేరు వెంచర్స్‌ మొదలైన ఇన్వెస్టర్లు 805 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిన డీల్స్‌ ఉన్నాయి.  

ఐపీవోలు, ఇతరత్రా మార్గాల్లో వాటాలు విక్రయించుకుని పీఈ/వీసీలు కొన్ని సంస్థల నుంచి నిష్క్రమించాయి. ఈ కోవకు చెందిన 120 డీల్స్‌ విలువ 9.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

ఉక్రెయిన్‌–రష్యా మధ్య ఉద్రిక్తతలు, కఠిన పరపతి విధానాలు, ధరల పెరుగుదల వంటి ప్రతికూలాంశాలతో సీక్వెన్షియల్‌గా పోలిస్తే పెట్టుబడులు తగ్గినప్పటికీ ప్రథమార్ధంలో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. నెలకు దాదాపు 6 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు