స్టార్టప్స్‌లోకి తగ్గిన వీసీ పెట్టుబడులు

19 May, 2022 06:10 IST|Sakshi

ఏప్రిల్‌లో సగానికి డౌన్‌

1.6 బిలియన్‌ డాలర్లకు పరిమితం

ముంబై: గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో అంకుర సంస్థల్లోకి వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) సంస్థల  పెట్టుబడులు సగానికి తగ్గాయి. 82 డీల్స్‌లో 1.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఏప్రిల్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 27 శాతం క్షీణించి 5.5 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చితో పోలిస్తే మాత్రం 11 శాతం పెరిగాయి.

కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ గ్రూప్‌ ఐవీసీఏ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుతో లిక్విడిటీ (నిధుల లభ్యత) తగ్గవచ్చని ఈవై పార్ట్‌నర్‌ వివేక్‌ సోని తెలిపారు. అయితే, అంతర్జాతీయ ఫండ్ల దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు.  పటిష్టమైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్, ఆ నిధులను దక్కించుకోవడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో వర్ధమాన మార్కెట్లకు సారథ్యం వహించవచ్చని వివేక్‌ వివరించారు.  

పెట్టుబడులకు రిస్కులు..
ద్రవ్యోల్బణం, చమురు ధరలు, దేశీయంగా వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు రూపాయితో పోలిస్తే డాలర్‌ బలపడుతుండటం మొదలైనవి .. వృద్ధి అంచనాలు, పీఈ/వీసీ పెట్టుబడులకు కొంత ప్రతిబంధకాలుగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు.  

నివేదికలో మరిన్ని విశేషాలు..
► ఏప్రిల్‌లో వర్స్‌ ఇన్నోవేషన్స్‌ అత్యధికంగా 805 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. మీడియా, వినోద రంగంలో ఇది రెండో అతి పెద్ద డీల్‌.  
► భారీ స్థాయి డీల్స్‌ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించడం కూడా తగ్గి 1.2 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో ఇది 2.7 బిలియన్‌ డాలర్లు.  
► ప్రస్తుతం క్యాపిటల్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐపీవోలు.. వేల్యుయేషన్లు తగ్గే అవకాశం ఉంది.
► ఏప్రిల్‌లో 16 ఫండ్లు 1.5 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎనిమిది ఫండ్లు 569 మిలియన్‌ డాలర్లు సేకరించాయి. భారత్‌లో పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఎలివేషన్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ఈసారి అత్యధికంగా 670 మిలియ్‌ డాలర్లు దక్కించుకుంది. 

మరిన్ని వార్తలు