ప్రైవేటీకరణతో అసలైన విలువ

16 Mar, 2021 03:16 IST|Sakshi

దీనివల్ల కంపెనీలు సమర్థవంతంగా మారతాయి 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో సమర్థవంతమైన యాజమాన్యం, ఆధునిక టెక్నాలజీల వినియోగం వల్ల వ్యూహాత్మక పెట్టుబడులను ఉపసంహరించుకునే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల (సీపీఎస్‌ఈ)కు నిజమైన విలువ సమకూరుతుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌. దీంతో ఉత్పాదకత, ఉపాధి కల్పన రూపంలో ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రతిఫలం అందుతుందన్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం.. ప్రాధాన్య రంగాల్లో లేని సీపీఎస్‌ఈలను గుర్తించి సిఫారసు చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించినట్టు మంత్రి చెప్పారు. జాతీయ భద్రత ఇతర అంశాలను నీతి ఆయోగ్‌ పరిగణనలోకి తీసుకుని సిఫారసులు చేస్తుందన్నారు. లాభాలను ఆర్జిస్తున్న షిప్పింగ్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించడానికి వెనుక ఉన్న ఉద్దేశం, కారణాలు ఏంటంటూ లోక్‌సభ సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా మంత్రి బదులిచ్చారు. వస్తు తయారీ, సేవల రంగాల్లో పోటీతత్వంలో కూడిన మార్కెట్లు అభివృద్ధి చెందిన తర్వాత అటువంటి రంగాల్లో ప్రభు త్వ పాత్రను తగ్గించుకుని, ప్రైవేటుకు అప్పగించినట్టయితే మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని మంత్రి వివరించారు. మరో ప్రశ్నకు.. 84 సీపీఎస్‌ఈలు, వాటి అనుబంధ సంస్థలు 2019–20లో నష్టాలను ఎదుర్కొన్నట్టు చెప్పారు.

ఉపాధి బాధ్యత ప్రభుత్వానిది... 
వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించినట్టయితే ఉపాధి, ఇతర సదుపాయాల నష్టం కలుగకుండా ఒప్పందంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రాజ్యసభకు ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొత్తం మీద మరింతగా ఉపాధి అవకాశాలు వస్తాయే కానీ, ఉద్యోగాలు కోల్పోవడం ఉండదన్నారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్తు, పెట్రోలియం, బొగ్గు, బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను వ్యూహాత్మక రంగాలుగా కేంద్రం ఇప్పటికే గుర్తించింది.  

సహారా క్యూ పెట్టుబడులు పక్కదారి 
సహారా క్యూ షాప్‌ పేరుతో వసూలు చేసిన పెట్టుబడులు.. సహారాయాన్‌ యూనివర్సల్‌ మల్టీపర్పస్‌ సొసైటీ, సహారా క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ, సహారా గ్రూపునకు చెందిన మరో రెండు సొసైటీలకు మళ్లించినట్టు  ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు లో తేలిందని సీతారామన్‌ లోక్‌సభకు తెలిపారు. 

మరిన్ని వార్తలు