హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు

17 Jan, 2022 17:00 IST|Sakshi

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో ప్రతి నెలా వృద్ధి

డిసెంబర్‌లో 3,939 గృహాల రిజిస్ట్రేషన్లు

వీటి మొత్తం విలువ రూ.2,340 కోట్లు

66 శాతం రిజిస్ట్రేషన్లు అందుబాటు గృహాలవే

2,000 చ.అ. విస్తీర్ణంలోపు ఇళ్లకే డిమాండ్‌

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదికలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రారంభ దశలో తడబడిన నగర రియల్టీ.. అనంతరం శరవేగంగా కోలుకుంది. వ్యాక్సినేషన్‌ పెరగడం, ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో ఉద్యోగ నియామకాల వృద్ధి, అందుబాటు ధరలతో గ్రేటర్‌లో ప్రతి నెలా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో 3,931 యూనిట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.2,340 కోట్లు. 2020 డిసెంబర్‌తో పోలిస్తే రిజిస్ట్రేషన్‌ సంఖ్యలో 0.5 శాతం తగ్గాయి కానీ ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే మాత్రం 16 శాతం వృద్ధి రేటు నమోదయింది. 

96 శాతం అధికం.. 
► గతేడాది నగరంలో రూ.25,330 కోట్ల విలువ చేసే 44,278 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 96 శాతం ఎక్కువ. 2020లో 22,570 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్‌ జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో ఆ తరగతి అఫర్డబుల్‌ గృహా కొనుగోళ్ల మీద ప్రత్యక్ష ప్రభావం పడింది.  

► రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్‌ హౌసింగ్‌ రిజిస్ట్రేషన్లు 2020లో 30 శాతం జరగగా.. గతేడాది డిసెంబర్‌ నాటికి 24 శాతానికి క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. 2021 డిసెంబర్‌లోని రిజిస్ట్రేషన్లలో 60 శాతం గృహాలు రూ.25– 50 లక్షల మధ్య ధర ఉన్నవే జరిగాయి. అన్ని కేటగిరీల్లో లగ్జరీ గృహాల రిజిస్ట్రేషన్లు పెరగడం గమనార్హం. రూ.కోటి పైన ధర ఉన్న గృహాలు 12 శాతం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. (చదవండి: బ్రాండ్‌ హైదరాబాద్‌.. లండన్‌, న్యూయార్క్‌.. ఇప్పుడు మనదగ్గర

వెయ్యి నుంచి 2 వేల చ.అ. విస్తీర్ణం లోపు ఇళ్లకే.. 
వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండాలనే అభిప్రాయం గృహ కొనుగోలుదారుల్లో పెరిగిపోయింది. దీంతో గతంలో కంటే కాస్త ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. గతేడాది డిసెంబర్‌లో వెయ్యి లోపు చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణం ఉన్న అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లు 19 శాతం జరగగా.. వెయ్యి నుంచి రూ.2 వేల చ.అ. మధ్య ఉన్నవి 66 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలు 15 శాతం ఉన్నాయి. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్‌ సొంత క్యాంపస్‌.. అదిరిపోయే సౌకర్యాలు)

మరిన్ని వార్తలు