ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీతో లావాదేవీలు వేగవంతం: డెలాయిట్‌

10 Mar, 2022 05:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)తో లావాదేవీలు వేగవంతం అవడమే కాకుండా, వ్యయాలు ఆదా అవుతాయని డెలాయిట్‌ సంస్థ తెలిపింది. డిజిటల్‌ రూపీపై ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. బ్లాక్‌చైన్‌ ఆధారిత డిజిటల్‌ కరెన్సీని 2022–23 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చే ప్రణాళికల్లో ఆర్‌బీఐ ఉండడం తెలిసిందే. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు సీబీడీసీ వినూత్నమైన, పోటీతో కూడిన చెల్లింపుల వ్యవస్థ కాగలదని అంచనా వేసింది.

ప్రస్తుతానికి ఎక్కువ శాతం సెక్యూరిటీల క్లియరింగ్, సెటిల్‌మెంట్‌ ప్రక్రియకు ఎన్నో రోజులు తీసుకుంటోందని, డిజిటల్‌ రూపీని ప్రవేశపెడితే సామర్థ్యాలు పెరగడంతోపాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గుతాయని అంచనా వేసింది. అదే సమయలో భద్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ‘‘ఇతర డిజిటల్‌ సాధనాలతో పోలిస్తే సీబీడీసీలకు సావరీన్‌ ఆప్షన్‌ ఉండడం అదనపు ఆకర్షణ. అదే ఇతర డిజిటల్‌ సాధనాలు అంత విశ్వసనీయమైనవి కావు. స్టోర్‌ ఆఫ్‌ వ్యాల్యూ సైతం ఎక్కువ అస్థిరతలతో ఉంటుంది’’ అని ఈ నివేదిక వివరించింది. భవిష్యత్తులో నగదు వినియోగం తగ్గినప్పడు విలువ బదిలీకి ప్రత్యామ్నాయం అవుతుందని, మరిం త విస్తృతంగా వినియోగించే పేమెంట్‌ సైకిల్‌గా మారొచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు