బిల్‌డెస్క్‌కు భారీ షాక్‌, రూ. 38,400 కోట్ల కొనుగోలు డీల్‌ రద్దు

4 Oct, 2022 06:58 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ బిల్‌డెస్క్‌ కొనుగోలు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రోజస్‌ ఎన్‌వీ తాజాగా పేర్కొంది. 4.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 38,400 కోట్లు) విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పేయూ నిర్వాహక సంస్థ ప్రోజస్‌ ఎన్‌వీ వెల్లడించింది. డీల్‌కు సంబంధించి గడువులోగా కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని తెలియజేసింది.

సెప్టెంబర్‌ ముగిసేలోగా ముందుగా చేసుకున్న కొన్ని ఒప్పంద పరిస్థితులను చేరుకోలేకపోవడంతో తాజా నిర్ణయానికి వచ్చినట్లు డచ్‌ ఈ–కామర్స్‌ దిగ్గజం ప్రోజస్‌ వివరించింది. అయితే ఈ డీల్‌కు సెప్టెంబర్‌ 5న కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) నుంచి అనుమతులు లభించినప్పటికీ ఏ ఇతర పరిస్థితులు అడ్డుపడ్డాయో వివరించకపోవడం గమనార్హం! డీల్‌ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఆటోమేటిక్‌గా రద్దుకానున్నట్లు  కూడా ప్రోజస్‌ వెల్లడించింది.
 
భారీ కంపెనీగా 

బిల్‌డెస్క్‌ను పేయూ సొంతం చేసుకుని ఉంటే వార్షికంగా 147 బిలియన్‌ డాలర్ల విలువైన పరిమాణం(టీపీవీ) ద్వారా డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజంగా ఆవిర్భవించి ఉండేది. ప్రత్యర్థి సంస్థలు రేజర్‌పే 50 బిలియన్‌ డాలర్లు, సీసీఎవెన్యూ(ఇన్ఫీబీమ్‌) 18–20 బిలియన్‌ డాలర్ల టీపీవీ కలిగి ఉన్నట్లు అంచనా. డీల్‌ పూర్తయిఉంటే ప్రోజస్‌ చేపట్టిన అతిపెద్ద కొనుగోలుగా నిలిచేది. కాగా.. గతేడాది ఆగస్ట్‌ 31న బిల్‌డెస్క్‌ కొనుగోలుకి ప్రోజస్‌ నగదు రూపేణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఫిన్‌టెక్‌ రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కేది.  

దేశంలో పెట్టుబడులు 
ప్రోజస్‌ మాతృ సంస్థ నేస్పర్స్‌ 4.5 లక్షల బిజినెస్‌లకు 100 రకాలకుపైగా చెల్లింపుల విధానాలలో సేవలు అందిస్తోంది. ప్రోజస్‌ ద్వారా దేశీయంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌గా కొనసాగుతోంది. స్విగ్గీ, ఫార్మ్‌ఈజీ తదితర టెక్నాలజీ కంపెనీలలో 6 బలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఇక బిల్‌డెస్క్‌ను ఆర్థర్‌ ఆండర్సన్, ఎంఎన్‌ శ్రీనివాసు, అజయ్‌ కౌశల్‌– కార్తిక్‌ గణపతి 2000లో ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ ఊపందుకుంది. ఇది కంపెనీ పురోభివృద్ధికి సహకరించింది. డీల్‌ సాకారమైతే వ్యవస్థాపకులు ఒక్కొక్కరికీ 50 కోట్ల డాలర్ల చొప్పున లభించి ఉండేవి. బిల్‌డెస్క్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ 14.2 శాతం, టీఏ అసోసియేట్స్‌ 13.1 శాతం, వీసా 12.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ముగ్గురు ప్రమోటర్లకు దాదాపు 30 శాతం వాటా ఉంది.

మరిన్ని వార్తలు