ఇంటి ముంగిటే బ్యాంకింగ్‌ సేవలు

11 May, 2021 04:27 IST|Sakshi

ప్రభుత్వరంగ బ్యాంకుల జట్టు

పీఎస్‌బీ అలయన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఏర్పాటు

బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్ల నియామకం

వారి ద్వారా కస్టమర్ల చెంతకే బ్యాంకింగ్‌ సేవలు

ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్‌ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్‌ చేస్తే చాలు.. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ కస్టమర్‌ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్‌బీ అలయన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి.

ఈ కంపెనీ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్‌ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్‌ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్‌బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్‌బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్‌బీ అలియన్స్‌ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్‌ ఫైనాన్షియల్‌ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్, రిలయన్స్‌ జియో పేమెంట్స్‌ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్‌ మిరాఖుర్‌ను పీఎస్‌బీ అలియన్స్‌ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది.

నమూనాపై కసరత్తు..
‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్‌బీల పరిధిలోని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్‌ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్‌ను పీఎస్‌బీ అలయన్స్‌ నియమించుకుంది.

రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్‌లను అధ్యయనం చేసేందుకు పీఎస్‌బీలు ‘కార్డెక్స్‌ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్‌బీ అలయన్స్‌గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్‌బీలు అన్నీ కలసి ప్రమోట్‌ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్‌ చెప్పారు.

ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్‌బీ అలయన్స్‌ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్‌ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్‌ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు.

కొన్ని బ్యాంకుల పరిధిలో..  
‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్‌బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్‌బీ అలయన్స్‌ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్‌బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్‌ మిరాఖుర్‌ తెలిపారు. నాన్‌ ఫైనాన్షియల్‌ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్‌ నివేదిక ఇవ్వడం, టీడీఎస్‌ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను కూడా ఆర్డర్‌ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్‌ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్‌ బ్యాంకింగ్‌ పోర్టల్, మొబైల్‌ యాప్, ఫోన్‌కాల్‌ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్‌టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్‌కు బ్యాంకులు చెల్లిస్తాయి.

మరిన్ని వార్తలు