బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..! ఆగిపోనున్న బ్యాంకు కార్యకలాపాలు..!

15 Dec, 2021 20:24 IST|Sakshi

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..! రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిసెంబర్‌ 16, 17వ తేదీన సమ్మెను చేపట్టనున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కార్యాకలాపాలు రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి.  ఈ సమ్మెలో సుమారు తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్టొంటారు. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులను అలర్ట్‌ చేశాయి. చెక్‌ క్లియరెన్స్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. 

సమ్మెను విరమించండి..!
రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్‌ సంఘాలతో ఆయా బ్యాంకులు సమ్మెను విరమించాలని ఉద్యోగులను కోరాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునివ్వగా.. ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమయ్యాయి. 

రెండు రోజులపాటు..!
2021-22 బడ్జెట్‌ సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రేవేటీకరణ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్‌ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ వెల్లడించారు. అంతేకాకుండా బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి:  రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి ఈపీఎఫ్ఓ శుభవార్త!

మరిన్ని వార్తలు