మూడేళ్లలో 30% మార్కెట్‌ గోవిందా!

22 Oct, 2021 05:00 IST|Sakshi

ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీల పరిస్థితి

ముంబై: కరోనా మహమ్మారి చూపిన ప్రభావంతో మోటారు బీమా వ్యాపారం గతేడాది కుదేలై తిరిగి కోలుకుంటుండగా.. మరోవైపు ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు మాత్రం పోటీనివ్వలేకపోతున్నాయి. క్రమక్రమంగా మార్కెట్‌ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నాయి. మోటారు బీమా మార్కెట్లో ఏడాది క్రితం ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు 36.6 శాతం వాటా ఉంటే, ఈ ఏడాది ఆగస్ట్‌ నాటికి 32.6 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీలు తమ వాటాను 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెంచుకున్నాయి.

కానీ, 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 13.9 శాతం (30 శాతం క్షీణత) మార్కెట్‌ వాటాను మూడేళ్ల కాలంలో కోల్పోయినట్టు తెలుస్తోంది. 2018 మార్చి నాటికి మొత్తమ మోటార్‌ బీమా విభాగంలో ప్రభుత్వరంగ సంస్థలకు 46.5శాతం వాటా ఉంటే, ప్రైవేటు సంస్థల చేతుల్లో 53.5 శాతం వాటా ఉండేది. 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల వాటా 40.7 శాతానికి తగ్గిపోయి, ప్రైవేటు బీమా కంపెనీల వాటా 59.3 శాతానికి పెరిగింది. 2020 మార్చి నాటికి ప్రభుత్వరంగ బీమా సంస్థల వాటా 34.2 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఆగస్ట్‌ నాటికి ఈ వాటా 32.6 శాతానికి దిగిపోవడం గమనార్హం.
 
విడిగా చూస్తే..

మోటార్‌ ఓడీ (ఓన్‌ డ్యామేజ్‌/వాహనదారుకు వాటిల్లేనష్టం) విభాగంలో 2018 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 37.5 శాతం వాటా, ప్రైవేటు బీమా సంస్థలు 62.5 శాతం వాటా చొప్పున కలిగి ఉన్నాయి. కానీ, 2021కు వచ్చే సరికి ప్రభుత్వరంగ కంపెనీల వాటా 25.5 శాతానికి పరిమితమైతే.. ప్రైవేటు కంపెనీల వాటా 74.5 శాతానికి పుంజుకున్నది. థర్డ్‌ పార్టీ (వాహనదారు కాకుండా ఎదుటి వారికి కలిగే నష్టం) మోటారు బీమాలో ప్రభుత్వరంగ సంస్థలకు 2018 మార్చి నాటికి 52.7 శాతం ఉంటే, అది తాజాగా 39.7 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 46.3 శాతం నుంచి 60.3 శాతానికి పుంజుకున్నది.   

శాఖలను క్రమబద్ధీకరించుకోండి
► ఖర్చులు తగ్గించుకోండి
► పీఎస్‌యూ సాధారణ బీమా కంపెనీలకు సూచనలు

ఆర్థిక పనితీరు మెరుగుపడేందుకు వీలుగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలకు కేంద్ర ఆర్థిక శాఖ పలు సూచనలు చేసింది. శాఖలను క్రమబదీ్ధకరించుకోవాలని, అనవసర వ్యయాలను నియంత్రించుకోవాలని కోరింది. ప్రభుత్వరంగంలో నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తుండగా.. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ఒక్కటే లాభాలతో నడుస్తోంది. నేషనల్‌ ఇన్సూరెన్స్, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ నష్టాలతో కొనసాగుతున్నాయి. వీటి ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బిల్లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందడం గమనార్హం. తక్కువ వ్యయాలతో కూడిన డిజిటల్‌ మాధ్యమంలో వ్యాపారాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలని కూడా బీమా కంపెనీలను కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాకపోతే దీనిపై ఉద్యోగుల సంఘం భిన్నంగా స్పందించింది. ‘‘ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాయి. శాఖల క్రమబద్ధీకరణ అన్నది పేదలకు భారంగా మారకూడదు. ఎందుకంటే చిన్నపాటి క్లెయిమ్‌ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్యాటిల్‌ ఇన్సూరెన్స్‌ లేదా ఫసల్‌ బీమా’’ అని జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కే గోవిందన్‌ అన్నారు. ప్రతీ జిల్లాకు ఒక శాఖ కచి్చతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లను యాజమాన్యాలకు తెలియజేసినట్టు చెప్పారు. 2021–22 బడ్జెట్‌లో ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి ప్రస్తావించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు