సర్కారీ షేర్లు జిగేల్‌!

4 Mar, 2021 05:37 IST|Sakshi

2021లో మార్కెట్‌ క్యాప్‌ 28% అప్‌

గత నాలుగేళ్లలోనే అత్యుత్తమ ర్యాలీ

ప్రైవేటైజేషన్‌ ప్రతిపాదనల ఎఫెక్ట్‌

పలు ప్రభుత్వ కంపెనీల రీరేటింగ్‌కు చాన్స్‌

గత నాలుగేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకోని ప్రభుత్వ రంగ దిగ్గజాలు కొద్ది రోజులుగా మార్కెట్లను మించుతూ పరుగందుకున్నాయి. తాజా బడ్జెట్‌లో పలు పీఎస్‌యూలను ప్రైవేటైజ్‌ చేయనున్నట్లు ప్రతిపాదించడంతో రీరేటింగ్‌కు అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ పీఎస్‌యూల మార్కెట్‌ విలువ 28 శాతంపైగా ఎగసింది. వివరాలు చూద్దాం..

ముంబై: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు ఊపందుకున్నాయి. మరోవైపు 2021–22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలను ప్రైవేటైజ్‌ చేసేందుకు ప్రతిపాదించింది. దీనికితోడు గత నాలుగేళ్లుగా మార్కెట్‌ ర్యాలీని అందుకోకపోవడంతో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు చౌకగా ట్రేడవుతున్నాయని స్టాక్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లాభదాయకత మెరుగుపడనున్న అంచనాలు, ప్రైవేటైజ్‌ కారణంగా రీరేటింగ్‌కు పెరిగిన అవకాశాలు కొద్ది రోజులుగా పీఎస్‌యూ కౌంటర్లకు డిమాండును పెంచినట్లు తెలియజేశారు. ప్రభుత్వ రంగంలోని పలు కంపెనీలు కమోడిటీ ఆధారితంకావడం, కొద్ది రోజులుగా కమోడిటీల సైకిల్‌ అప్‌టర్న్‌ తీసుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు వివరించారు.

జోరు తీరిలా
పలు సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో పీఎస్‌యూ షేర్లు ఇటీవల మార్కెట్‌ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. వెరసి 2021 జనవరి నుంచి చూస్తే పీఎస్‌యూ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)కు రూ. 3.84 లక్షల కోట్లమేర జత కలసింది. అంటే గత వారాంతానికల్లా ఈ విలువ 28 శాతం ఎగసి రూ. 19.45 లక్షల కోట్లకు చేరింది. 2017 తదుపరి ఇది అత్యధికంకాగా.. గత రెండు నెలల్లో ప్రామాణిక ఇండెక్స్‌ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 శాతమే ర్యాలీ చేయడం గమనార్హం!

హింద్‌ కాపర్‌ స్పీడ్‌
కొత్త ఏడాదిలో దూకుడు చూపుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజాలలో హిందుస్తాన్‌ కాపర్‌ ముందుంది. జనవరి– ఫిబ్రవరి మధ్య ఈ షేరు 152 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఎంఎస్‌టీసీ లిమిటెడ్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌(ఫ్యాక్ట్‌), రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(ఆర్‌సీఎఫ్‌), నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌), ఎన్‌బీసీసీ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌ 90–60 శాతం మధ్య జంప్‌చేశాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు