కొత్త పేరుతో త్వరలో పబ్జీ

7 May, 2021 05:02 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పాపులర్‌ గేమ్‌ పబ్‌జీ గుర్తుందిగా.. కొద్ది రోజుల్లో బాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా పేరుతో ఈ గేమ్‌ దర్శనమీయనుంది. అది కూడా కేవలం భారత్‌కే పరిమితం కానుందని దక్షిణ  కొరియాకు చెందిన వీడియో గేమ్‌ డెవలపర్‌ క్రాఫ్టన్‌ వెల్లడించింది. చైనా యాప్స్‌కు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బాటిల్‌గ్రౌండ్స్‌ (పబ్జీ) మొబైల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే.

చైనాకు చెందిన ఇంటర్నెట్‌ కంపెనీ టెన్సెట్‌ భారత్‌లో పబ్జీని ఆఫర్‌ చేసింది. అయితే ఇక నుంచి ఈ గేమ్‌ అధికారం టెన్సెట్‌ ఇండియాకు లేదని పబ్జీ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. ఎప్పుడు ఈ గేమ్‌ను అందుబాటులోకి తెచ్చేదీ వెల్లడించనప్పటికీ కొత్త లోగోను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. ఉచితంగానే గేమ్‌ను విడుదల చేయనున్నట్టు క్రాఫ్టన్‌ వెల్లడించింది. భారత్‌లో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడి మార్కెట్‌ కోసం ప్రత్యేక గేమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు గతేడాది నవంబర్‌లో పబ్జీ కార్పొరేషన్‌ ప్రకటించింది. వ్యాపార పునరుద్ధరణ కోసం మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్‌తో కలిసి సుమారు రూ.740 కోట్లు భారత్‌లో ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. పబ్జీ డౌన్‌లోడ్స్‌ దేశంలో 17.5 కోట్లకుపైమాటే.
 

మరిన్ని వార్తలు