జాతీయ ఆదాయంలో 20%.. వేతనాల్లో 40%

30 Aug, 2022 05:33 IST|Sakshi

ప్రభుత్వ రంగ సంస్థలపై వాటాపై ఇండ్‌–రా నివేదిక

ముంబై: భారత్‌ మొత్తం జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) వాటా 20 శాతం అయితే, మొత్తం వేతనాల్లో వాటా 40 శాతంగా ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌–రా) తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రైవేటు రంగం విషయంలో ఈ రేట్లు ‘దాదాపు సమతౌల్యంగా’ వరుసగా 36.3 శాతం, 35.2 శాతాలుగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌)కు సంబంధించి 2020–21కి ముందు గడచిన పదేళ్ల కాలంలో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రాతిపదికన ఈ విశ్లేషణ చేసినట్లు ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలకు సంబంధించి ప్రభుత్వం పాత్రను తగ్గించాలని ఒత్తిడి చేస్తూ, ప్రభుత్వ రంగంలోని సమర్థత లోపాన్ని తరచుగా ఎత్తి చూపే విమర్శకులకు తాజా నివేదిక మద్దతునిస్తోంది.  నివేదిక ప్రకారం, 2011–2021 మధ్య వేతనాల సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 10.4 శాతంగా ఉంటే, మూలధనంపై రాబడి 8.8 శాతం వృద్ధిని (సీఏజీఆర్‌) నమోదుచేసుకుంది. 

మరిన్ని వార్తలు