పప్పు దినుసుల ధర తగ్గేది ఎప్పుడు ?

19 Jun, 2021 16:08 IST|Sakshi

పెరుగుతున్న ఆహారా ధాన్యాల ధరలు

వంద పెట్టనిదే చేతికందని పప్పు ధాన్యాలు

దేశంలో సమృద్ధిగా నిల్వలు.. అయినా తగ్గని ధరలు 

ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం 

వెబ్‌డెస్క్‌ : దేశంలో కంది, మినప, పెసర, శనగ, మసూరీ పప్పు దినులులు దాదాపు 27 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సమృద్ధిగా నిల్వలు ఉన్నా పప్పు దినుసుల ధరలు మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటుంన్నాయి. వంద రూపాయలు పెట్టనిదే కేజీ పప్పు దొరకని పరిస్థితి నెలకొంది. 

కేంద్రం నజర్‌
నిత్యవసర వస్తువుల పెరుగుదలపై కేంద్రం నజర్‌ పెట్టింది. ముఖ్యంగా పప్పు దినుసుల ధరల పెరుగుదలను కంట్రోల్‌ చేసేందుకు యాక‌్షన్‌ ప్లాన్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో పప్పు ధాన్యాల నిల్వలు ఎంతున్నాయనే అంశంపై దృష్టి సారించింది. దీంతో రాష్ట్రాల వారీగా పప్పు ధాన్యం నిల్వలపై ఆరా తీసింది.

ధరల భారం
ఓ వైపు కరోనా గండం వెంటాడుతుండగా మరో వైపు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యుల రెక్కలు విరిచేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోలు, మంచి నూనెల ధరలు ఆకాశాన్ని తాకుంతుండగా నెమ్మదిగా పప్పు దినుసుల ధరలు కూడా పైపైకి చేరుకుంటున్నాయి. వంట నూనెల వినియోగం ఇప్పటికే తగ్గిపోయింది. అయితే పప్పు దినుసుల ధరల పెరుగుదల గుబులు పట్టిస్తోంది. గడిచిన రెండేళ్లుగా అన్ని రకాల పప్పు ధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి జూన్‌ వరకు కంది, మినప, పెసర పప్పులు కేజీ ధరపై రూ. 10 అదనంగా పెరిగింది. ఈ పప్పు దినుసుల్లో తక్కువ రకం ధరలే రూ. 110కి పైగా ఉన్నాయి. ఇంతకు మించి ధరలు పెరిగితే సామాన్యులు తట్టుకోవడం కష్టమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

లెక్కలు చెప్పండి
ఏ రాష్ట్రంలో ఏ పప్పు ధాన్యం ఎంత నిల్వ ఉందో చెప్పాలంటూ రాష్ట్రాలను కోరింది కేంద్రం. దీని ఆధారంగా దేశ వ్యాప్తంగా 28.66 లక్షల టన్నుల పప్పు ధాన్యం నిల్వలు ఉన్నట్టుగా తేలింది. ఈ వివరాలన్నీ నాఫెడ్‌ వెబ్‌సైట్‌లో పొందు పరిచింది. ఎక్కడైన పప్పు దినుసుల నిల్వలు తగ్గిపోతే మరొక చోటు నుంచి కొనుగోలు చేయాలని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కంది, పెసర, మినప పప్పు ధరలు పెరగకుండా చూడాలంటూ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రకటనలకే పరిమితమా 
గతంలో మంచి నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం సమీక్ష నిర్వహించింది. ధరలు తగ్గించేందుకు పన్నుల కేటగిరీల్లో మార్పులు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే క్షేత్ర స్థాయిలో ధరలు ఏమీ తగ్గలేదు. డిసెంబరు వరకు ఆయిల్‌ ధరలు తగ్గవని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు పప్పు ధాన్యాల విషయంలోనూ ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

చదవండి : Oil Prices: అమెరికాలో కరువు.. ఇండియా వంటగదిలో పిడుగు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు