పీఎన్‌బీ కస్టమర్లకు అలర్ట్‌.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్‌ ఖాతాపై ఆంక్షలు తప్పవ్‌!

27 Nov, 2022 12:48 IST|Sakshi

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన కస్టమర్లు డిసెంబర్ 12 కేవైసీ (KYC) వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు చేసింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న తమ ఖాతాదారులకు పీఎన్‌బీ ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

అలాగే రిజిస్టర్డ్ అడ్రస్‌కు రెండు నోటీసులు పంపించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరి కేవైసీ అప్‌డేట్ ఇంకా పెండింగ్‌లో ఉందో వారికి మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు పీఎన్‌బీ అధికారికి ట్వీటర్‌లో ట్వీట్‌ చేసింది. 

ట్వీట్‌లో ఏముంది
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు కేవైసీ అప్‌డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి ఏ కస్టమర్ల ఖాతాకు సంబంధించి కేవైసీ పెండింగ్‌లో ఉందో వారికి మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కస్టమర్లు వెంటనే వారి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి 12.12.2022 లోపు ఈ అప్‌డేట్ ప్రక్రియని పూర్తి చేయాలి.  ఇది పూర్తి చేయని కస్టమర్ల ఖాతాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది.

KYCని ఎలా అప్‌డేట్ చేయాలి
పీఎన్‌బీ కస్టమర్లు గుర్తింపు, అడ్రస్‌ ప్రూఫ్‌, ఇటీవలి ఫోటోలు, పాన్‌ కార్డ్‌, ఇన్‌కం ప్రూఫ్‌, మొబైల్ నంబర్‌లు వంటి వివరాలను బ్యాంకుకు మెయిల్‌ చేయవచ్చు (తమ బ్యాంక్‌ అకౌంట్‌లో రిజస్టర్‌ చేసుకున్న ఈమెయిల్‌ ద్వారా),  లేదా వ్యక్తిగతంగా  ఈ సమాచారాన్ని బ్యాంకుకు వెళ్లి అందివ్వాల్సి ఉంటుంది. పీఎన్‌బీ ఖాతాదారులు కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదా అనే సమాచారం కోసం 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సేవతో కనెక్ట్ కావచ్చు.
 

చదవండి: మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేం‍ద్రం ఏం చెప్పిందంటే?

మరిన్ని వార్తలు