బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌! ఈ బ్యాంకులో కొత్త రూల్‌..

3 Mar, 2023 19:30 IST|Sakshi

ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు చెల్లింపుల విషయంలో కొత్త రూల్‌ తీసుకొస్తోంది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్‌)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్‌ ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రూల్‌ మోసపూరిత చెక్కుల చెల్లింపు నుంచి కస్టమర్లను కాపాడుతుంది. ఇంతకుముందు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పీపీఎస్‌లో చెక్కు వివరాలను సమర్పించాల్సి ఉండేది. 

రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, చెక్కు నంబర్, చెక్కు ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, చెక్కు మొత్తం, లబ్ధిదారు పేరుతో సహా అవసరమైన వివరాలను కస్టమర్‌లు పీపీఎస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాలు జరిగే అవకాశం తగ్గుతుందని బ్యాంకు పేర్కొంటోంది.

చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి

కస్టమర్లు ఈ పీపీఎస్‌ సౌకర్యాన్ని బ్యాంకు బ్రాంచ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్‌ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. చెక్కు ప్రెజెంటేషన్‌ లేదా క్లియరింగ్‌ తేదీకి ఒక రోజు ముందుగా చెక్కు వివరాలను పీపీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి సీటీఎస్‌ క్లియరింగ్‌లో సమర్పించే రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారు ఇష్టం. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం మాత్రం దీన్ని తప్పనిసరి చేయవచ్చని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.

మరిన్ని వార్తలు