‘పంజాబ్‌’ మెప్పించేది ఎప్పుడు?

12 May, 2022 08:12 IST|Sakshi

పీఎన్‌బీ అదే పనితీరు

66 శాతం తక్కువగా నికర లాభం 

మొండి రుణాలకు అధిక కేటాయింపులు 

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మెప్పించే పనితీరును మార్చి త్రైమాసికంలో ప్రదర్శించలేకపోయింది. సంస్థ స్టాండలోన్‌ నికర లాభం 66 శాతం క్షీణించి రూ.202 కోట్లకు పరిమితం అయింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలకు చిల్లు పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.586 కోట్లను నమోదు చేయడం గమనార్హం. ఇక స్టాండలోన్‌ ఆదాయం సైతం రూ.21,386 కోట్ల నుంచి రూ.21,095 కోట్లకు తగ్గింది. వసూలు కాని మొండి రుణాలకు (ఎన్‌పీఏలకు), కంటింజెన్సీల పేరుతో రూ.4,851 కోట్లను మార్చి త్రైమాసికంలో పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.3,540 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 

ఇక 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి పీఎన్‌బీ నికర లాభం రూ.3,457 కోట్లకు దూసుకుపోయింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,021 కోట్లుగానే ఉంది. స్థూల ఎన్‌పీఏలు 14.12 శాతం నుంచి 11.78 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 5.73 శాతం నుంచి 4.8 శాతానికి దిగొచ్చాయి. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.0.64 చొప్పున డివిడెండ్‌ను బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!

మరిన్ని వార్తలు