మార్కెట్‌ నుంచే నిధుల సమీకరణ

25 Aug, 2020 04:58 IST|Sakshi
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఎండీ ఎస్‌ఎస్‌ మల్లికార్జున రావు

ప్రభుత్వం నుంచి మరింత మూలధనం వద్దు..

పీఎన్‌బీ ఎండీ మల్లికార్జునరావు

న్యూఢిల్లీ: నిధుల సాయం కోసం ఈ విడత కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఎండీ ఎస్‌ఎస్‌ మల్లికార్జున రావు స్పష్టం చేశారు. మార్కెట్‌ నుంచే నిధులను సమీకరించాలనుకుంటున్నట్టు చెప్పారు. రూ.14,000 కోట్లను మార్కెట్‌ నుంచి సమీకరించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారని, ఇందులో రూ.7,000 కోట్లు ఈక్విటీ రూపంలో ఉంటుందని సోమవారం మీడియాతో వర్చువల్‌ గా నిర్వహించిన సమావేశం సందర్భంగా తెలిపారు.

ప్రభుత్వ ఇష్యూలకు తగినంత ఆసక్తి
ప్రభుత్వ బ్యాంకుల నిధుల అవసరాలను తీర్చే అనుకూల పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తున్నాయని మల్లికార్జునరావు చెప్పారు. బీవోబీ, పీఎన్‌బీ ఇటీవలే చేపట్టిన టైర్‌–2 బాండ్‌ ఇష్యూకు  వడ్డీరేటు సహేతుకంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాదే(2020–21) రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల విక్రయం రూపంలో మరో రూ.500 కోట్లను సమీకరించుకోనున్నట్టు చెప్పారు.  

దివాలా కేసుల రూపంలో రూ.8,000 కోట్లు
జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా చట్టం కింద కేసుల పరిష్కారం రూపంలో రూ.6,000–8,000 కోట్లు రావచ్చని తాము అంచనా వేస్తున్నట్టు మల్లికార్జునరావు తెలిపారు. అనుబంధ సంస్థ పీఎన్‌ బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లో ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ లేదా రైట్స్‌ ఇష్యూ రూపంలో రూ.600 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు చెప్పారు.  

4–6 శాతం మేర రుణ వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ రుణ వితరణలో 4–6 శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని మల్లికార్జునరావు చెప్పారు. అక్టోబర్‌ నుంచి ఆర్థికరంగ కార్యకలాపాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.

40,000 కోట్ల రుణాల పునర్‌ వ్యవస్థీకరణ
ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఆగస్ట్‌ తర్వాత పీఎన్‌ బీ సుమారు రూ.40,000 కోట్ల రుణాలను పునర్‌ వ్యవస్థీకరించే అవకాశం ఉందని మల్లికార్జునరావు వెల్లడించారు. కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్‌ వరకు రుణ చెల్లింపులపై మారటోరియం అవకాశం ఇచ్చిన ఆర్‌ బీఐ, అనంతరం ఒక్కసారి రుణ పునర్‌ వ్యవస్థీకరణకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

పీఎన్‌బీ లాభం రూ.308 కోట్లు
2020–21 ఏడాది తొలి త్రైమాసికానికి (ఏప్రిల్‌–జూన్‌) పీఎన్‌బీ రూ.308 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని(అనుబంధ సంస్థల ఫలితాలు కలపకుండా) ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకుకు వచ్చిన లాభం రూ.1,018 కోట్లతో పోలిస్తే రెండొంతులు తగ్గిపోయింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పీఎన్‌బీలో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విలీనం కావడంతో, ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ ఫలితాలను క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చలేమని బ్యాంకు పేర్కొంది.

మరిన్ని వార్తలు