రెండో రోజూ రికార్డు ర్యాలీ..!

11 Nov, 2020 04:38 IST|Sakshi

మార్కెట్‌కు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ బూస్ట్‌  

ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు  

43000 పైన ముగిసిన సెన్సెక్స్‌ 

నిఫ్టీకి 170 పాయింట్ల లాభం 

ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ  

ముంబై: మార్కెట్లో రెండోరోజూ రికార్డుల ర్యాలీ కొనసాగింది. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ట్రయల్‌ దశలో 90 శాతం విజయవంతమైందనే వార్తలతో సూచీలు మంగళవారం మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి గెలుపు, ప్రపంచ మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ వంటి అంశాలు సూచీల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ 43,316 వద్ద, నిఫ్టీ 12,644 వద్ద జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి. మార్కెట్‌ ముగిసేవరకూ కొనుగోళ్లే కొనసాగడంతో సెనెక్స్‌ 680 పాయింట్ల లాభంతో తొలిసారి 43000పైన 43,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 12600 పైన 12,631 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు కూడా సూచీలకు రికార్డులే కావడం విశేషం. వరుస ఏడురోజుల ర్యాలీలో భాగంగా సెన్సెక్స్‌ మొత్తం 3663 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 989 పాయింట్లను జమచేసుకుంది. ఇక నగదు విభాగంలో మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.5,672 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు(డీఐఐలు) రూ.2,309 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.  

జీవితకాల గరిష్టాలను అందుకున్న సూచీలు... 
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ విజయవంతంపై ఆశలు, పలుదేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు యోచనలతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సె క్స్‌ 43000 శిఖరాన్ని అధిరోహించింది. అలాగే నిఫ్టీ సైతం 12500 స్థాయిని అందుకుంది. బిహార్‌ ఎన్నికల లెక్కింపులో ఎన్‌డీఏ కూటమి ఆధిక్యం దిశగా సాగడం,  మిడ్‌ సెషన్‌ సమయంలో యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం లాంటి అంశాలు  ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ 43,316 వద్ద, నిఫ్టీ 12,644 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.  

ఐటీ, ఫార్మా  షేర్లకు నష్టాలు ...  
రికార్డు ర్యాలీలో ఐటీ, ఫార్మా షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ రంగాల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 4.33 శాతం పతనమైంది. సిప్లా, దివీస్‌ ల్యాబ్స్, డాక్టర్‌ రెడ్డీస్, సన్‌ ఫార్మా షేర్లు 5 నుంచి 3 శాతం క్షీణించాయి. మరోవైపు ఐటీ రంగానికి చెందిన టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ షేర్లు 6 శాతం నుంచి 3 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 4 శాతం నష్టంతో ముగిసింది.  

‘‘కోవిడ్‌–19 వ్యాక్సిన్స్‌ 3 దశల్లో విజయవంతమైనట్లు ఫైజర్‌ ప్రకటనతో ఇన్వెస్టర్లు విశ్వాసాన్నిచ్చింది. ఆర్థిక రికవరీ ఆశలు భారీగా పతనమైన షేర్లను కొనేందుకు తోడ్పడ్డాయి’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ అర్జున్‌ యశ మహజన్‌ తెలిపారు. ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి గెలుపు తదితర అంశాలు ర్యాలీకి సహకరించాయన్నారు. అయితే కోవిడ్‌ సంక్షోభంలో విజేతలుగా నిలిచిన ఐటీ, ఫార్మా షేర్లు లాభాల స్వీకరణతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు మహజన్‌ పేర్కొన్నారు.  అదానీ గ్రీన్, ఎస్కార్ట్స్, హావెల్స్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేకే సిమెంట్స్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఫైజర్, ఎస్‌ఆర్‌కే షేర్లు జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి.   

మరిన్ని వార్తలు