మళ్లీ.. మల్టీప్లెక్స్‌ల హవా..

27 Jul, 2020 12:36 IST|Sakshi

అన్‌లాక్‌-3 ఎఫెక్ట్‌

పీవీఆర్‌ లిమిటెడ్‌ 4 శాతం అప్‌

ఐనాక్స్‌ లీజర్‌ 9 శాతం హైజంప్‌

భారీగా ఎగసిన ట్రేడింగ్‌ పరిమాణం

కరోనా వైరస్‌ కట్టడికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్‌డవున్‌లు ప్రకటించాక డీలాపడిన మల్టీప్లెక్స్‌ కౌంటర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్‌ కంపెనీలు పీవీఆర్‌ లిమిటెడ్‌, ఐనాక్స్‌ లీజర్‌ జోరందుకున్నాయి. నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అన్‌లాక్‌-3లో భాగంగా కొన్ని సినిమా థియేటర్లను ఆగస్ట్‌ 1 నుంచి తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించనుందన్న వార్తలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం..  

జోరుగా..
దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ల చైన్‌ కలిగిన పీవీఆర్‌ లిమిటెడ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,147 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.3 శాతం ఎగసి రూ. 1,172ను తాకింది.  ఇక ఐనాక్స్‌ లీజర్‌ మరింత అధికంగా 8 శాతం దూసుకెళ్లి రూ. 259 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం పురోగమించి రూ. 268కు చేరింది. అన్‌లాక్‌-3లో దేశవ్యాప్తంగా పలు సినిమా థియేటర్లను తిరిగి ఆగస్ట్‌ 1 నుంచి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించనుందన్న వార్తలతో ఐనాక్స్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. మధ్యాహ్నానికల్లా బీఎస్‌ఈలో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 35,000 షేర్లు మాత్రమేకావడం గమనార్హం!

మరిన్ని వార్తలు