పీవీఆర్‌ కొత్త స్క్రీన్ల ఏర్పాటు

28 Sep, 2022 04:27 IST|Sakshi

రూ. 350 కోట్ల పెట్టుబడులకు రెడీ

మరో మూడేళ్లపాటు విస్తరణ బాటలో

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 100 స్క్రీన్లు(తెరలు) ఏర్పాటు చేయనున్నట్లు మల్టీప్లెక్స్‌ దిగ్గజం పీవీఆర్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. మల్టీప్లెక్స్‌ రంగంలోని మరో కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌తో విలీనం 2023 ఫిబ్రవరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. దీంతో పీవీఆర్‌ ఐనాక్స్‌గా సంయుక్త బిజినెస్‌ను నిర్వహించనున్నట్లు పీవీఆర్‌ సీఈవో గౌతమ్‌ దత్తా పేర్కొన్నారు. వీక్షకులు తిరిగి సినిమా థియేటర్లకు వచ్చేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు వెల్లడించారు.

దీంతో ఆహారం, పానీయాల విభాగం అమ్మకాలు సైతం పుంజుకున్నట్లు ఏప్రిల్‌–జూన్‌(క్యూ1) ఫలితాలపై స్పందిస్తూ వివరించారు. వెరసి తెరల విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది బాటలోనే వచ్చే రెండు, మూడేళ్లలో కూడా విస్తరణను కొనసాగించే వీలున్నట్లు తెలియజేశారు. 60 శాతం తెరలను నగరాలలో ఏర్పాటు చేయనుండగా.. మిగిలిన వాటిని కొత్త ప్రాంతాలలో నెలకొల్పనున్నట్లు వివరించారు. రూర్కెలా, డెహ్రాడూన్, వాపి, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం, అహ్మదాబాద్‌లో విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిధులను నగదు నిల్వలు, అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు