మల్టీప్లెక్స్ షేర్ల లాభాల షో

5 Nov, 2020 13:22 IST|Sakshi

నేటి నుంచి మహారాష్ట్రలో థియేటర్లు షురూ

8.6 శాతం దూసుకెళ్లిన పీవీఆర్ లిమిటెడ్

5 శాతం జంప్ చేసిన ఐనాక్స్ లీజర్

నేటి నుంచి మహారాష్ట్రలో అన్ని సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రారంభంకానున్న నేపథ్యంలో లిస్టెడ్ మల్టీప్టెక్స్ కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల గల అన్ని సినిమా హాళ్లు, థియేటర్లను ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నేటి(5) నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే థియేటర్ల సీట్ల సామర్థ్యంలో 50 శాతం వరకూ మాత్రమే అనుమతించింది. అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లను తెరిచేందుకు మార్గదర్శకాలను జారీ చేసిన విషయం విదితమే. సమాచార, ప్రసార శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డవున్ తదుపరి మార్చి నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు తదితరాలు మూత పడిన సంగతి తెలిసిందే.

షేర్ల జోరు
సినిమా హాళ్ల పున:ప్రారంభం నేపథ్యంలో మల్టీప్లెక్స్ రంగ లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ షేరు దాదాపు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 1,212 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఐనాక్స్ లీజర్ సైతం 4.5 శాతం జంప్ చేసి రూ. 276 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 280 వరకూ ఎగసింది. 

మరిన్ని వార్తలు