రూ.4 లక్షల కోట్లు: భవిష్యత్‌ అంతా ఎంటర్‌టైన్‌మెంటే!

15 Jul, 2021 00:28 IST|Sakshi

2025 నాటికి దేశీ మీడియా, వినోద రంగంపై అంచనాలు

టెక్నాలజీ, ఇంటర్నెట్‌ వినియోగం ఊతం

పీడబ్ల్యూసీ నివేదిక

న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే దేశీ మీడియా, వినోద (ఎంఈ) రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు చేరనుంది. అటు ప్రకటనకర్తలు, ఇటు వినియోగదారులు మీడియాపై చేసే వ్యయాలు ఇందుకు తోడ్పడనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఎంఈ రంగం వార్షిక ప్రాతిపదికన 10.75 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 4,12,656 కోట్లకు చేరనుంది. ‘కరోనా వైరస్‌ మహమ్మారికి కూడా భారత మీడియా, వినోద రంగం దీటుగా ఎదురునిల్చింది‘ అని కన్సల్టెన్సీ పార్ట్‌నర్‌ రాజీబ్‌ బసు తెలిపారు.  టెక్నాలజీ పురోగతి, ఇంటర్నెట్‌ మరింతగా అందుబాటులోకి వస్తుండటం తదితర అంశాలు.. ప్రజలు కంటెంట్‌ను వినియోగించే తీరుతెన్నులను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక భాషల్లోని కంటెంట్‌కు మరింతగా డిమాండ్‌ ఉంటుందని, వ్యాపార విధానాలు సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని వివరించారు.

విభాగాలవారీగా చూస్తే.. 

  • మహమ్మారిపరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2020లో టీవీ అడ్వర్టైజింగ్‌ రూ.35,015 కోట్లకు చేరింది. ఇది 7.6 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి మొత్తం ఎంఈ రంగంలో సుమారు రూ.50,000 కోట్ల మేర దీని వాటా ఉండనుంది. 
  • ఇంటర్నెట్‌ మాధ్యమంలో ప్రకటనలు 2020-25 మధ్య 18.8 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రూ.30,000 కోట్లకు చేరనున్నాయి. 
  • 2020లో రూ.7,331 కోట్లుగా ఉన్న మొబైల్‌ ఇంటర్నెట్‌ అడ్వర్టైజింగ్‌ విభాగం 25.4 శాతం వృద్ధి రేటుతో 2025 నాటికి రూ. 22,350 కోట్లకు చేరుతుంది. 
  • న్యూస్‌పేపర్, కన్జ్యూమర్‌ మ్యాగజైన్‌ విభాగం మాత్రం స్వల్పంగా 1.82 శాతం స్థాయిలో మాత్రమే వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 26,299 కోట్లకు చేరనుంది. మహమ్మారి నేపథ్యంలో 2020లో ప్రింట్‌ అడ్వర్టైజింగ్‌ ఆదాయాలు 12 శాతం, ప్రింట్‌ సర్క్యులేషన్‌ ఆదాయం 4 శాతం మేర తగ్గాయి. 
  • మహమ్మారి ధాటికి కుదేలైన బాక్సాఫీస్‌ ఆదాయాలు మళ్లీ కోలుకుని 2025 నాటికి 39.3 శాతం వార్షిక వృద్ధితో రూ.13,857 కోట్లకు చేరవచ్చు. తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ 2023 మధ్య నాటికి.. తిరిగి కోవిడ్‌ పూర్వ స్థాయికి కోలుకోవచ్చు. 
  • 2020లో మ్యూజిక్, రేడియో, పాడ్‌కాస్ట్‌ల మార్కెట్‌ ఆదాయాలు రూ.4,626 కోట్లకు పడిపోయాయి. లైవ్‌ మ్యూజిక్‌ విభాగం ఆదాయం సుమా రు రూ. 522 కోట్ల మేర క్షీణించింది. ఇది తిరిగి కోలుకుని 19.1 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2025 నాటికి రూ.11,026 కోట్లకు చేరనుంది.  
  • వీడియో గేమ్స్, ఈ-స్పోర్ట్స్‌ విభాగం ఆదాయాలు 2020లో రూ.11,250 కోట్లకు చేరగా .. 2025 నాటికి వార్షికంగా 16.5 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.24,213 కోట్లకు చేరవచ్చు. వివిధ ఇన్నోవేషషన్లు ఇందుకు దోహదపడతాయి.
మరిన్ని వార్తలు