Moonlighting: మూన్‌లైటింగ్‌పై విప్రో సీఈవో కీలక వ్యాఖ్యలు

13 Oct, 2022 09:14 IST|Sakshi

మూన్‌లైటింగ్‌పై విప్రో సీఈఓ థియెరీ డెలాపోర్ట్‌  క్లారిటీ

న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3శాతం క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15శాతం పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా లాభం సుమారు 4శాతం, ఆదాయం 5శాతం  వృద్ధి చెందాయి. (‘అదానీ’ కి టెలికం లైసెన్స్‌: డాట్‌ గ్రీన్‌ సిగ్నల్‌)

‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్‌ తెలిపారు.  వివాదాస్పదమైన మూన్‌లైటింగ్‌పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్‌ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఇదీ చదవండి:  ఫెస్టివ్‌ బొనాంజా: హోం లోన్లపై ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్స్‌

ఇతర విశేషాలు.. 
► ఆర్డరు బుకింగ్‌లు 23.8 శాతం, భారీ డీల్స్‌ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్‌ కుదిరాయి.  
► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్‌ చేసింది. అట్రిషన్‌ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది.  
► సెప్టెంబర్‌ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది.  

(క్లిక్‌ : అంచనాలు మించి అదరగొట్టిన హెచ్‌సీఎల్‌ టెక్‌)

మరిన్ని వార్తలు