ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడితో.. లాభాలు చూస్తే కళ్లుచెదరాల్సిందే

2 Jan, 2023 13:19 IST|Sakshi

గడిచిన ఏడాది కాలంలో లార్జ్‌క్యాప్‌ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయి. ఇదే కాలంలో మిడ్‌­క్యా­ప్, స్మాల్‌క్యాప్‌ కంపెనీలు ఎంతో దిద్దుబాటును చూశాయి. కానీ, ఈ ఏడాది మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ కూడా మంచి పనితీరు చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దృష్ట్యా చూస్తే మల్టీక్యాప్‌ పథకాలు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇప్పుడనే కాదు, దీర్ఘకాలంలో స్థిరమైన, మెరుగైన రాబడులను తెచ్చిపెట్టగలవు. ఈ  విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో క్వాంట్‌ యాక్టివ్‌ ఫండ్‌ కూడా ఒకటి. గతంతో క్వాంట్‌ గ్రోత్‌ ఫండ్‌గా ఇది పనిచేసింది.  

రాబడులు  
ఈ పథకం అన్ని కాలాల్లోనూ మెరుగైన రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పథకం పేరు మారినా పనితీరులో మార్పు లేదు. ఎందుకంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయగలదు. దీర్ఘకాల లక్ష్యాలైన పిల్లల ఉన్నత విద్య, వివహాలు, రిటైర్మెంట్‌ కోసం తప్పకుండా ఈ పథకాన్ని పరిశీనలోకి తీసుకుని అధ్యయనం చేయవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 10 శాతానికి పైనే ఉంది. కానీ, ఇదే కాలంలో ప్రధాన సూచీల రాబడి 5 శాతంలోపే ఉండడాన్ని గమనించొచ్చు. ఇక మూడేళ్లల కాలంలో ఈ పథకం 35 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. ఏడేళ్ల కాలంలో చూసినా 19.34 శాతం, పదేళ్లలో 20 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఈ పథకం పనితీరుకు ప్రామాణికమైన బీఎస్‌ఈ 500 సూచీ రాబడులు ఏడాది కాలంలో కవేలం 5 శాతంలోపే ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే బీఎస్‌ఈ 500 కంటే ఈ పథకం రెట్టింపు రాబడులను ఇచ్చింది. బీఎస్‌ఈ 500 వార్షికంగా 17.76 శాతం రాబడినివ్వగా, క్వాంట్‌ యాక్టివ్‌ 35.13 శాతం ఇచ్చింది. ఏడేళ్లు, పదేళ్లలోనూ రాబడుల పరంగా ఎంతో వ్యత్యాసం ఉండడం ఫండ్‌ పెట్టు బడుల విధానంలోని బలాన్ని తెలియజేస్తోంది. 

పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం ఈ పథకంలోని ప్రత్యేకత. 2018 నవంబర్‌ నాటికి ఈ పథకం నిర్వహణలో కేవలం రూ.7 కోట్లు ఉంటే, నాలుగేళ్లలో రూ.3,480 కోట్లకు చేరుకోవడం అసాధారణ వృద్ధి అని చెప్పుకోవాలి. ఫండ్‌ పనితీరు మెరుగ్గా ఉండడంతో అధిక పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అధిక అస్థిరతలను (పెట్టుబడుల విలువలో హెచ్చు తగ్గులు) ఓర్చుకోగలిగి, సగటు కంటే ఎక్కువ రిస్క్‌ భరించే వారికి క్వాంట్‌ యాక్టివ్‌ ఫండ్‌ అనుకూలం.

గ్రోత్‌ లేదా వ్యాల్యూ లేదా కాంట్రా తరహా ఏదో ఒక పెట్టుబడుల విధానానికి ఇది పరిమితం కాదు. ఎక్కడ బంగారం లాంటి అవకాశం కనిపించినా, పథకం పెట్టుబడుల విధానం పరిధిలో ఆయా అవకాశాలను సొంతం చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 99.2 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఇందులో 58 శాతం మేర లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 35 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 16 శాతానికి పైన పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 58 స్టాక్స్‌ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూ.19 శాతం పెట్టుబడులు ఈ రంగంలోని కంపెనీలకు కేటాయించింది. కన్జ్యూమర్‌ స్టాపుల్స్‌లో 16 శాతం, సేవల రంగ కంపెనీల్లో 13.57 శాతం, మెటీరియల్స్‌ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది.

మరిన్ని వార్తలు