పసిడి పరుగు ఆగదు..!

18 Sep, 2020 04:51 IST|Sakshi

అదే బాటలో వెండి కూడా

పెట్టుబడులకు అనువుగా భారత్‌

ఇన్వెస్ట్‌మెంట్‌ గురు జిమ్‌ రోజర్స్‌

న్యూఢిల్లీ: బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతూనే ఉంటాయని, వాటి ధరలు కొత్త రికార్డు స్థాయిలకు చేరతాయని ఇన్వెస్ట్‌మెంట్‌ గురు, క్వాంటమ్‌ ఫండ్‌ సహ–వ్యవస్థాపకుడు జిమ్‌ రోజర్స్‌ తెలిపారు. ‘రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ దేశాలు పలు సమస్యలు ఎదుర్కోనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరగవచ్చు. పసిడి కొత్త గరిష్ట స్థాయిలను తాకడం కొనసాగుతుందని భావిస్తున్నాను. ఆల్‌–టైమ్‌ గరిష్ట స్థాయికి వెండి ఇంకా 45 శాతం దూరంలో ఉంది. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేలోగా అది కూడా మరో కొత్త గరిష్ట స్థాయిని తాకవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పలు దిగ్గజ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పసిడిపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో రోజర్స్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పసిడి అంటే పెద్దగా గిట్టని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ గురు వారెన్‌ బఫెట్‌ సైతం 563 మిలియన్‌ డాలర్లతో కెనడాకు చెందిన ఒక పసిడి మైనింగ్‌ సంస్థ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. ఒకవైపు ఈక్విటీలు మరోవైపు పసిడి రేట్లు కూడా ర్యాలీ చేస్తుండటంపై రోజర్స్‌ స్పందించారు. ‘చరిత్ర చూస్తే.. ప్రభుత్వాలు, కరెన్సీలపై నమ్మకం కోల్పోయినప్పుడల్లా ప్రజలు పసిడి, వెండిపై ఇన్వెస్ట్‌ చేస్తున్న సంగతి తెలుస్తోంది. మళ్లీ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. సెంట్రల్‌ బ్యాంకులు నోట్లను భారీగా ముద్రిస్తున్న కొద్దీ ప్రజలకు కరెన్సీపై నమ్మకం సడలుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులపై క్రమేపీ నమ్మకం తగ్గవచ్చని, పసిడి ధర మరింత పెరగవచ్చని భావిస్తున్నాను‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌పై ఆసక్తి ..
వర్ధమాన దేశాల మార్కెట్లు పరుగులు తీస్తున్నాయని, పెట్టుబడులకు అత్యంత అనువైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని రోజర్స్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచ దేశాలు ఎడాపెడా నగదు ముద్రిస్తున్నాయి. అది ఎక్కడో ఒక దగ్గర ఖర్చు కావాలి. గణనీయంగా పడిపోయిన వర్ధమాన మార్కెట్లలోకి ఆ డబ్బు వచ్చి చేరుతోంది. అందుకే ఆ దేశాల మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. భారత్‌లో కూడా అదే జరుగుతోంది. అందరూ ఇండియాలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు‘ అని ఆయన తెలిపారు. తన అలసత్వం కారణంగానే భారత్‌లో ఇప్పటిదాకా ఇన్వెస్ట్‌ చేయలేదని, అందుకు కాస్త విచారం కలుగుతోందన్నారు. ‘భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు నిజంగానే స్మార్ట్‌గాను, వివేకవంతంగా వ్యవహరించారనే భావించాలి. స్థానిక అంశాలపై అవగాహన ఉంటే నేనూ కచ్చితంగా భారత్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తా‘ అని రోజర్స్‌ పేర్కొన్నారు.

మరో టెక్‌ బబుల్‌..: టెక్నాలజీ స్టాక్స్‌ ర్యాలీ బుడగ ఏదో ఒక సమయంలో పేలడం ఖాయమని రోజర్స్‌ హెచ్చరించారు. ‘కొన్ని మార్కెట్లలో బబుల్స్‌ కనిపించడం మొదలైంది. కొన్ని అమెరికన్‌ కంపెనీల షేర్లు తగ్గనే తగ్గడం లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ధోరణులే బబుల్‌కు దారితీస్తాయి. వీటిలో కొన్ని షేర్లు గణనీయంగా పతనం కాబోతున్నాయి. పడిపోయే ప్రసక్తే లేదనిపించే స్టాక్స్‌ ఏదో ఒక రోజు అత్యంత భారీగా పతనమవుతాయి. ఇన్వెస్టర్లు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి‘ అని రోజర్స్‌ పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు