క్వీన్‌ వాడే ఫోన్‌ ఏంటో తెలుసా? ఈ భూమ్మీద మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ఫోన్‌! ప్రత్యేకతలు ఇవే..

29 Nov, 2021 12:51 IST|Sakshi

Queen Elizabeth II Uses Phone And Facebook: ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య ‘స్మార్ట్‌ఫోన్‌ డాటా థ్రెట్‌’.  ఫోన్‌ ఎంతటి అప్‌డేట్‌ వెర్షన్‌ అయినప్పటికీ.. డాటాను చోరీ చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు హ్యాకర్లు. ఈ క్రమంలో బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా తమ చేత వాటం ప్రదర్శిస్తున్నారు. అయితే.. బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ II మాత్రం ఈ విషయంలో మినహాయింపు కలిగి ఉన్నారట!
 

ఈ భూమ్మీద అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ఫోన్‌ను క్వీన్‌ ఎలిజబెత్‌ II వాడుతున్నారట!. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో క్వీన్‌ ఛాంబర్‌లో ఇప్పటికీ సంప్రదాయ ల్యాండ్‌ లైన్ ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ దేశాల నేతలు ఫోన్‌ చేసినా ఆమె ఆ ఫోన్‌తో మాత్రమే మాట్లాడతారు. అలాంటిది రాజవంశంలో మొట్టమొదటిసారి పాలించే ఓ వ్యక్తి.. వ్యక్తిగతంగా ఫోన్‌ ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూస్‌ ఏజెన్సీ స్ఫుతినిక్‌ ప్రకారం.. క్వీన్‌ ఎలిజబెత్‌ II ఉపయోగించే మొబైల్‌ హైసెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉందట. బ్రిటిష్‌ నిఘా విభాగం ఎం16 రూపొందించిన ఈ వ్యవస్థ హ్యాకర్లకు చిక్కదని, పైగా ఆ ఫోన్‌లో ఫేస్‌బుక్‌ సైతం ఆమె ఉపయోగిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది.

   

ఇక ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు ఇంకా ఎన్‌క్రిప్షన్‌కు(సెండర్‌- రీడర్‌ మాత్రమే చూడగలిగే సెక్యూరిటీ) నోచుకోని విషయం తెలిసిందే. యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లపైనే పట్టొచ్చని ఫేస్‌బుక్‌ ప్రకటించుకుంది కూడా.  కానీ, ఎలిజబెత్‌ రాణి వాడుతున్న ఫోన్‌లో మాత్రం ఎం16 రూపొందించిన యాంటీ హ్యాకర్‌ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ ఉందని, అందువల్ల ఆ ఫోన్‌లో ఉండే ఫేస్‌బుక్‌ మాత్రమే కాదు.. ఫోన్‌లోని ఇతర డాటా మొత్తం చాలా భద్రంగా ఉంటుందని  యూకేపాడ్‌కాస్ట్‌ ఓ కథనంలో వెల్లడించింది. 

ఇంతకీ ఫోన్‌ కంపెనీ ఏంటంటే.. శాంసంగ్‌. కెమెరాతో కూడిన ఈ అల్ట్రా స్లిమ్‌ ఫోన్‌ను ప్రపంచంలోనే మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ఫోన్‌గా పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ను చూసుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మనుషులు ఉన్నారట! వాళ్లు ఎప్పుడూ ఆ ఫోన్‌ ఛార్జ్‌ డౌన్‌ కాకుండా చూసుకుంటారట. అంతేకాదు ఆ ఫోన్‌లో ఆమె ఇద్దరితో ఎక్కువగా ఛాటింగ్‌ చేస్తోందని(ప్రైవసీ వల్ల వివరాలు వెల్లడించలేదు), ఆమె స్పందించనప్పుడు ఆమె ఫోన్‌ను హ్యాండిల్‌ చేసే వీలు ఇద్దరికి మాత్రమే ఉందని(ఒకరు ఆమె కూతురు యువరాణి అన్నె, రాణి మేనేజర్‌ జాన్‌ వారెన్‌) స్పుత్‌నిక్‌ సారాంశం.

సీక్రెట్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌

అమెరికా మెటా (ఒకప్పుడు ఫేస్‌బుక్‌) అందించే ఫేస్‌బుక్‌ మీద యూకేలో వ్యతిరేకత ఉంటుందన్నది తెలిసిందే. కానీ, బ్రిటన్‌ రాణి ఫోన్‌లో ఒక రహస్య ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇందులో ఆమె ఎక్కువగా వీడియోస్‌ చూస్తూ సమయం గడుపుతున్నారట. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌.. అదీ 95 ఏళ్ల బ్రిటన్‌ మహరాణి వాడుతున్నారనే స్టింగ్‌ ఆపరేషన్‌ కథనాలు టెక్‌ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పుడు. కరోనా పరిస్థితుల తర్వాత వీడియో కాల్స్‌ ఉద్దేశంతో ఆమె ఈ ఫోన్‌ను వాడుతున్నారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు