ఐపీవో​కి రేడియంట్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌.. స్టాక్‌ ప్రైస్‌ ఎంతంటే?

21 Dec, 2022 14:52 IST|Sakshi

న్యూఢిల్లీ: వారాంతాన(23న) ప్రారంభంకానున్న పబ్లిక్‌ ఇష్యూకి రేడియంట్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ రూ. 94–99 ధరల శ్రేణిని ఖరారు చేసింది. మంగళవారం(27న) ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3,31,25,000 షేర్లను ప్రమోటర్‌ డేవిడ్‌ దేవసహాయంతోపాటు, పీఈ సంస్థ అసెంట్‌ క్యాపిటల్‌ అడ్వయిజర్స్‌ ఇండియా ఆఫర్‌ చేయనుంది. తద్వారా కంపెనీ రూ. 388 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 

2015లో అసెంట్‌ క్యాపిటల్‌ రేడియంట్‌లో 37.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. ప్రత్యేకంగా రూపొందిన రక్షణాత్మక వ్యాన్లను సొంతం చేసుకునేందుకు వెచ్చించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 150 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చెయ్యాలి. 

జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషన్‌ రెడీ 
ఫిన్‌టెక్‌ కంపెనీ జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషన్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.05 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2011లో ప్రారంభమైన కంపెనీ బిజినెస్‌ టు బిజనెస్‌ టు కస్టమర్‌ విభాగంలో పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు