వడ్డీరేట్లు పెంచడం దేశద్రోహం ఏమీ కాదంటున్న ఆర్థికవేత్త

25 Apr, 2022 19:53 IST|Sakshi

దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, బ్యాం‍కువడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం అనేది సర్వ సాధారణంగా జరిగే నిర్ణయమే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాగే చేస్తాయి. ఇవాళ కాకపోతే రేపయినా మనం చేయక తప్పదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్‌ మైలేజ్‌ కోసం వాడుకుంటున్నాయి. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని ద్రేశద్రోహం (యాంటీ నేషనల్‌) అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ లింక్‌డ్‌ఇన్‌ పోస్టులో రఘురాం రాజన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోంది. ఈ సమయంలో ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం రావడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. దీంతో మార్చిలో చిల్లర ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 6.95 శాతానికి చేరగా టోకు ద్రవ్యోల్బణం 14.55ని టచ్‌ చేసింది. అయితే ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుకు సుముఖంగా లేదు. దీంతో పలు బ్యాంకులు నేరుగా కాకపోయినా పరోక్ష పద్దతిలో వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో బ్యాంకుల వడ్డీ రేట్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను ఉద్దేశించి రఘురాం రాజన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 
 

చదవండి: బిగ్‌ షాక్‌: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు!

మరిన్ని వార్తలు