భారతీయ రైల్వేకు కనక వర్షం కురిపిస్తున్న తత్కాల్ టికెట్లు..!

3 Jan, 2022 17:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న 2020-21 ఏడాదిలోనూ.. రైల్వేకు వెయ్యికోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి మొత్తం 1033కోట్లు రైల్వే వసూలు చేసింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా 403 కోట్లు రాగా, ప్రీమియం తత్కాల్ కింద 119 కోట్లు, డైనమిక్ ఛార్జీలకు 511 కోట్లు వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరంలో చాలా వరకు రైళ్లను నిలిపివేశారు. అయిన, ఈ మేరకు ఆదాయం రావడం గమనార్హం. 

రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే తత్కాల్ టికెట్ల ద్వారా 353 కోట్లు, ప్రీమియం తత్కాల్ కింద 89 కోట్లు, డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.240 కోట్లు వచ్చినట్లు రైల్వే వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు భారతీయ రైల్వే సంస్థ డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.1,313 కోట్లు, తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.1,669, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.603 కోట్లు సంపాదించింది. ఈ తత్కాల్ టిక్కెట్లపై విధించే ఛార్జీలు "కొంచెం అన్యాయమైనవి" అని రైల్వేలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యానించిన ఒక నెల తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి డేటా బయటకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా ప్రజలు భాదపడుతున్న సమయంలో ప్రయాణీకులపై భారాన్ని మోపడం తగదు అని కమిటీ పేర్కొంది. 

(చదవండి: వాహనదారులకు భారీషాక్‌ , 43 లక్షల వాహనాల లైసెన్స్‌ రద్దు!)

మరిన్ని వార్తలు