రైల్వే సదుపాయాలను ప్రైవేటీకరించేది లేదు

20 Mar, 2021 00:00 IST|Sakshi

ఆస్తులపై ఆదాయం రాబట్టుకుంటాం 

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ 

న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధి కోసం ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించి నిధులు రాబట్టుకునే (మానిటైజేషన్‌) ప్రణాళికలతో ఉన్నట్టు రైల్వే మంత్రీ పీయూష్‌ గోయల్‌ రాజ్యసభకు శుక్రవారం తెలియజేశారు. ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన చేపట్టనున్నామని.. తద్వారా రూ.30,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను తీసుకురానున్నట్టు తెలిపారు. ఈస్టర్న్, వెస్టర్న్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లను ప్రారంభించిన తర్వాత మానిటైజేషన్‌ ప్రణాళికతో రైల్వే శాఖ ఉన్నట్టు చెప్పారు. అలాగే, పీపీపీ నమూనాలో స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికుల రైళ్లు, రైల్వే భూములు, బహుళ వినియోగ భవనాలు, రైల్వే కాలనీలు, రైల్వే స్టేడియమ్‌ల రూపంలో నిధులు రాబట్టుకోనున్నట్టు వివరించారు. ఆస్తుల నగదీకరణ వల్ల రైల్వేల అభివృద్ధికి కావాల్సిన నిధు లు సమకూరతాయన్నారు. సభ్యుల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.  

ప్రైవేటీకరణ/మానిటైజేషన్‌ వేర్వేరు 
కాంగ్రెస్‌ సభ్యుడు జైరామ్‌రమేశ్‌ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ..  ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రైవేటీకరణ చేయడం అంటే ఆస్తులను శాశ్వతంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేయడం. అందులో ఇక ఏ మాత్రం ప్రభుత్వ యాజమాన్యం ఉండదు. కానీ, రైల్వే అమలు చేయనున్న ప్రణాళిక ఏమిటంటే.. ఆస్తులను ఉపయోగించి నిధులను సమకూర్చుకోవడం (మానిటైజేషన్‌) ఎలాగన్నదే. ఇలా సమకూర్చుకునే నిధులు తిరిగి పెట్టుబడులు పెట్టి, వృద్ధి చెందేందుకే. రైల్వే మౌలిక ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేవేటీకరించము’’ అని పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. డెడికేటెడ్‌ ఫ్రైడ్‌ కారిడార్లు (డీఎఫ్‌సీ) ప్రత్యేక కార్పొరేట్‌ విభాగాలని.. రైల్వే మద్దతు వాటికి ఉంటుందన్నారు. డీఎఫ్‌సీ వేసే ట్రాక్‌లకు రైల్వే యజమానిగా లేదన్నారు. పెట్టుబడి ఆధారిత వృద్ధికి రైల్వే కీలకమైనదిగా మంత్రి పేర్కొన్నారు. ‘‘ఒక్క రోడ్డును నిర్మిస్తే ప్రతీ ఒక్కరూ దానిని వినియోగించుకుంటారు. అలాగే, ఒక నూతన రైల్వే ట్రాక్‌ను నిర్మించి వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించి ప్రోత్సహిస్తే.. అది కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందే కానీ, ఉన్న ఉద్యోగాలకు నష్టం చేయదు’’ అని మంత్రి చెప్పారు.  

మరిన్ని వార్తలు