‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ

8 Oct, 2020 04:19 IST|Sakshi

అర్హత అభ్యర్థనలకు భారీగా దరఖాస్తులు

రైల్వే శాఖకు 120 ప్రతిపాదనలు

బరిలో 15 కంపెనీలు

మేఘా ఇంజనీరింగ్, జీఎంఆర్, ఐఆర్‌సీటీసీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రైవేటు రైలు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రైవేటు రైళ్ల నిర్వహణకు తమకు తగిన అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకు (రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌) దరఖాస్తులను ఆహ్వానించగా.. 12 క్లస్టర్లకు 15 కంపెనీల నుంచి మొత్తం 120 దరఖాస్తులు దాఖలైనట్టు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ భారతీయ కంపెనీలే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా కూడా పాల్గొన్నది.

పీపీపీ విధానంలో..
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దేశవ్యాప్తంగా 12కు పైగా క్లస్టర్లలో 140 మార్గాల్లో (రానుపోను) 151 అధునాతన రైళ్లను ఎంపికైన సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌పై ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌క్యూ) అన్నది మొదటి దశ. ఈ దశలో తగిన అర్హతలు కలిగిన సంస్థలను రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది. వీటి నుంచి రెండో దశలో.. ప్రతిపాదనలను (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌/ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానిస్తుంది. ‘‘దరఖాస్తుల మదింపు ప్రక్రియను రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తుంది. అర్హత సాధించిన కంపెనీలకు ఆర్‌ఎఫ్‌పీ పత్రాలు 2020 నవంబర్‌ నాటికి అందుబాటులో ఉంటాయి. 2021 ఫిబ్రవరి నాటికి అన్ని క్లస్టర్ల కేటాయింపును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాము’’ అని రైల్వే శాఖ ప్రకటించింది.  

సికింద్రాబాద్‌ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు
సికింద్రాబాద్‌ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌తోపాటు.. జీఎంఆర్‌ హైవేస్‌ లిమిటెడ్, ఐఆర్‌సీటీసీ, అరవింద్‌ ఏవియేషన్, బీహెచ్‌ఈఎల్, కన్‌స్ట్రక్షన్స్‌ వై ఆక్సిలర్‌ డీ ఫెర్రోక్యారైల్స్, ఎస్‌ఏ, క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 3, గేట్‌వే రైల్‌ ఫ్రయిట్‌ లిమిటెడ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్, ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్స్, మాలెంపాటి పవర్‌ ప్రైవేటు లిమిటెడ్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, సాయినాథ్‌ సేల్స్‌ అండ్‌ సర్వీసెస్, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలు ఆర్‌ఎఫ్‌క్యూలు సమర్పించాయి.

మరిన్ని వార్తలు