ఐపీవోకు 2 కంపెనీలు రెడీ

15 Mar, 2022 06:16 IST|Sakshi

జాబితాలో రెయిన్‌బో చిల్డ్రన్స్, ఈముద్ర

సెబీ నుంచి తాజాగా అనుమతులు

న్యూఢిల్లీ: కొత్తగా రెండు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో మల్టీ స్పెషాలిటీ పిడియాట్రిక్‌ ఆసుపత్రుల చైన్‌ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్, డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్‌ సర్వీసుల సంస్థ ఈముద్ర చేరాయి. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది చివర్లో రెండు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం..

రెయిన్‌బో చిల్డ్రన్స్‌
ఐపీవోలో భాగంగా హైదరాబాద్‌ సంస్థ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మార్కెట్‌ వర్గాల అంచనాల ప్రకారం ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లకుపైగా సమకూర్చుకునే వీలుంది. యూకేకు చెందిన సీడీసీ గ్రూప్‌ తొలుత 1999లో చిన్నపిల్లలకు ప్రత్యేకించిన రెయిన్‌బో ఆసుపత్రిని హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఈ ఆసుపత్రి 50 పడకలతో ఏర్పాటుకాగా.. తదుపరి కంపెనీ విస్తరణ బాటలో సాగింది. దీంతో 2021 సెప్టెంబర్‌కల్లా 1500 పడకలతో కూడిన 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్‌లకు విస్తరించింది.  

ఈముద్ర
దేశీయంగా అధికారిక సర్టిఫైయింగ్‌ లైసెన్స్‌ కలిగిన అతిపెద్ద సంస్థగా ఈముద్ర నిలుస్తోంది. 2021 మార్చికల్లా డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్‌ మార్కెట్లో వాటాను 37.9 శాతానికి పెంచుకుంది. 2020 మార్చికల్లా ఈ వాటా 36.5 శాతంగా నమోదైంది. కాగా.. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, పరికరాల కొనుగోలు, డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు తదితరాల కోసం వెచ్చించనుంది.

మరిన్ని వార్తలు