వేలం వెర్రిగా ఎలక్ట్రిక్‌ వాహనాలు

11 Jun, 2022 05:06 IST|Sakshi

సంబంధం లేని వాళ్లంతా వ్యాపారంలోకి వస్తున్నారు

అందుకే అగ్ని ప్రమాదాల్లాంటి ఉదంతాలు

బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఆక్షేపణ

విద్యుత్‌ వాహనాల ప్లాంట్‌ ప్రారంభం 

పుణె: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) అంశం వేలం వెర్రిగా మారిందని, ఈవీ వ్యాపారంతో సంబంధం లేని వాళ్లంతా కూడా పరిశ్రమలోకి వస్తున్నారని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఆక్షేపించారు. అందుకే అగ్నిప్రమాదాల్లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. పుణెలోని అకుర్దిలో బజాజ్‌ ఆటో అనుబంధ సంస్థ చేతక్‌ టెక్నాలజీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం ప్రత్యేక ప్లాంటును ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది కేవలం అగ్నిప్రమాదాల గురించి మాత్రమే కాదు. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్ల వాహనాల్లోనూ ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి.

అయితే, ఈవీల విషయంలో సమస్యంతా తయారీ ప్రక్రియతోనే ఉంటోంది. ఈవీల వ్యవహారం వేలం వెర్రిగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈవీలతో సంబంధం లేని వాళ్లకు ఈ వ్యాపారంతో ఏ పని ఉంది? ఈ విధానాన్ని సరిచేయాలి. బహుశా, ప్రభుత్వంలోని సంబంధిత అధికార వర్గాలు ఈవీల నిబంధనలను సడలించారేమో. అందుకే ఈవీలు మార్కెట్‌ను వరదలా ముంచెత్తుతున్నాయి‘ అని బజాజ్‌ పేర్కొన్నారు. ‘తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల పేరుతో దేన్నైనా రోడ్డు మీదకు తీసుకొస్తున్నారు. మరి స్కూటర్లకు అగ్నిప్రమాదాలు జరగకుండా  మరేమవుతుంది?‘ అని ఆయన ప్రశ్నించారు.  

ప్లాంటుపై రూ. 750 కోట్ల పెట్టుబడులు
కొత్తగా ఏర్పాటు చేసిన ఈవీల తయారీ ప్లాంటుపై చేతక్‌ టెక్నాలజీ (సీటీఎల్‌), దాని వెండార్‌ భాగస్వాములు రూ. 750 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయనున్నారు. సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఉంటుంది. వార్షికంగా దీని తయారీ సామర్థ్యం 5 లక్షల ద్విచక్ర వాహనాలుగా ఉంటుంది. 2019 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన చేతక్‌ ఈ–స్కూటర్లను ఇప్పటివరకూ 14,000 పైచిలుకు విక్రయించామని, 16,000 పైగా బుకింగ్స్‌ ఉన్నాయని బజాజ్‌ తెలిపారు.

‘చేతక్‌ అనేది సిసలైన మేక్‌ ఇన్‌ ఇండియా సూపర్‌స్టార్‌. అది ఎంతో మంది వాహనప్రియుల అభిమానం చూరగొంది. దేశీయంగానే డిజైన్‌ చేసి, ఇక్కడే నిర్మించిన ఎలక్ట్రిక్‌ చేతక్‌ .. మా పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలకు, తయారీలో దశాబ్దాల అనుభవానికి, వినియోగదారులు .. ఉత్పత్తులపై మాకున్న లోతైన అవగాహనకు నిదర్శనం‘ అని బజాజ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు