Akasa Airlines Delay Reasons: బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ప్లాన్స్‌లో మార్పులు.. కారణం ఇదే

20 May, 2022 08:55 IST|Sakshi

ఆకాశ ఎయిర్‌ మరింత ఆలస్యం 

జూన్, జులైకల్లా తొలి విమానం  

ముంబై: సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఆకాశ ఎయిర్‌ సర్వీసులు మరింత ఆలస్యంకానున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి తొలి విమానం(ఎయిర్‌క్రాఫ్ట్‌) ఈ ఏడాది జూన్‌ లేదా జులైలో అందే వీలున్నట్లు డీజీసీఏ సీనియర్‌ అధి కారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ పేరుతో రిజిస్టరైన ఈ ముంబై సంస్థ గతేడాది అక్టోబర్‌లో పౌర విమానయాన శాఖ నుంచి నోఅబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ను పొందిన సంగతి తెలిసిందే. 

తొలి విమానం వచ్చేది అప్పుడే
తాజాగా చోటు చేసుకున్న మార్పుల ప్రకారం ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు జులైలో  ప్రారంభించే యోచనలో ఆకాశ ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి ఎయిర్‌క్రాఫ్ట్‌ను అందుకున్నాక తొలుత పరీశీలన ప్రాతిపదికన విజయవంతంగా సర్వీసులను నిర్వహించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. 2022 జూన్‌ మధ్యకల్లా తొలి విమానాన్ని పొందే వీలున్నట్లు ఆకాశ ఎయిర్‌ వ్యవస్థాపకుడు, ఎండీ వినయ్‌ దూబే అంచనా వేశారు. విమానయాన సర్వీసుల సంస్థ(ఏవోపీ)గా అనుమతులు పొందేందుకు ముందుగా పరిశీలనా సర్వీసులు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. వెరసి 2022 జులైకల్లా వాణిజ్య ప్రాతిపదికన సర్వీసులను ప్రారంభించగలమని భావిస్తున్నట్లు చెప్పారు. 2023 మార్చికల్లా 18 విమానాలను సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.   

చదవండి: రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్‌ అదే, రూ.66వేల కోట్లతో..!

మరిన్ని వార్తలు