Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలా లేని ఆకాశ ఎయిర్‌లైన్‌ పరిస్థితి ఏంటి? 

14 Aug, 2022 18:13 IST|Sakshi

సాక్షి,ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అకాలమరణంతో ఇటీవలే సేవలను ప్రారంభించిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్‌ భవితవ్యం ఏంటి? ప్రణాళికలు ఏంటి? సంస్థ నిర్వహణ ఎలా ఉండబోతోంది   అనే సందేహాలు బిజినెస్‌ వర్గాల్లో నెలకొన్నాయి.  ఝున్‌ఝున్‌వాలా  రెక్కల కింద ఎదగాలని, రాణించాలని ఎదురు చూసిన ఆకాశ ఎయిర్‌కి ఆయన ఆకస్మిక మరణం షాక్‌నిచ్చింది. (ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే)

ముఖ్యంగా భారతదేశంలో, బిలియనీర్ యాజమాన్యంలోని విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, సుబ్రతా రాయ్ సహారాకు చెందిన సహారా ఎయిర్‌లైన్స్ కథ ఇదే. ఈ కారణంగానే విశ్లేషకులు ఆకాశ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించకముందే దాని భవిష్యత్తుపై, సందేహాలను, భయాలను వ్యక్తం చేశారు. ఇపుడు ఆయన హఠాన్మరణంతో ఈ భయాలు మరింత పెరిగాయి.  (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్‌ మూవీలు ఏవో తెలుసా?)

అయితే  ఆకాశ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ  ఝున్‌ఝున్‌వాలా వారసత్వాన్ని, విలువను  ముందుకు తీసుకెడతామని, మంచి విలువలతో గొప్ప విమానయాన సంస్థగా నడపడానికి కృషి చేస్తామని దూబే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా తనపై విశ్వాసముంచిన ఆయనకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆకాశకు ఝున్‌ఝున్‌వాలా చాలా కీలకం. ముఖ్యమైన పెట్టుబడిదారుడిగా మాత్రమే కాకుండా ఆయనకున్న అపారమైన పలుకుబడితో బ్యాంకులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి చౌకగా ఫైనాన్సింగ్ ఏర్పాటు చేయగల సత్తా ఉన్నవారు.  అలాంటి ఆయన మరణంతో కొంత ఒత్తిడి తప్పదని సీనియర్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. 

ఆయన మరణం కంపెనీ వృద్ధికి, ఆశయ సాధనకు తాత్కాలిక బ్రేక్స్‌ ఇస్తుందని, పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే దేశ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే గ్లోబల్ఎయిర్‌లైన్స్‌తో ఆకాశ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని మరికొంతమంది మార్కెట్‌ నిపుణుల అంచనా. 

ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్ సంస్థ ఎల్‌సిసిలో 40 శాతానికి పైగా వాటా  3.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 264 కోట్లు) పెట్టుబడులు పెట్టాడు. ఇది ఆయన చివరి ప్రధాన పెట్టుబడులలో ఒకటి మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఇష్టమైనది కూడా. ఆకాశ మొదటి విమానంలోని ప్రయాణీకులతో తీసుకున్న సెల్పీలు తీపి జ్ఞాపకాలుగా మిగిలి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ పేరొందిన ఝున్‌ఝున్‌వాలా చివరిసారిగా ఆగస్ట్ 7న ముంబై -అహ్మదాబాద్ మధ్య జరిగిన ఆకాశ ఎయిర్ తొలి విమాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. వీల్‌చైర్‌లో తిరుగుతూ అందరిన్నీ ఉ‍త్సాహపరుస్తూ జోక్స్‌ వేస్తూ పోటీదారులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యాల్లోగానీ, ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆకాశ యాజమాన్యం , సిబ్బందికి  పిలుపునిచ్చారు.

ఆకాశ కోసం ఝున్‌ఝున్‌వాలా  
ఏవియేషన్‌ రంగంలోకి అడుగుపెట్టి ఇండిగో లాంటి సంస్థల్ని భయపెట్టిన ఝున్‌ఝున్‌వాలా సంస్థ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలే వేశారు విస్తృతమైన పెట్టుబడితో పాటు, ఎయిర్‌లైన్ నిర్వహణ కోసం అగ్రశ్రేణి విమానయాన పరిశ్రమ లీడర్లను ఎంచుకున్నారు. ప్రపంచంలో బహుశా ఏ విమానయాన సంస్థ ఏర్పాటైన 12 నెలల్లో సేవలు ప్రారంభించ లేదు. కానీ ఝున్‌ఝున్‌వాలా ఆ ఘనతను సాధించారు.

ముఖ్యంగా జెట్ ఎయిర్‌వేస్, గో ఫస్ట్ సీఈఓగా పనిచేసిన దుబెనే సీఈవోగా ఎంపిక చేశారు. విమానయాన సంస్థలో దుబేకు 31 శాతం వాటా ఉంది. అలాగే  2018 వరకు ఇండిగో డైరెక్టర్‌గా ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఆదిత్య ఘోష్‌ను కూడా తన టీంలో చేర్చుకున్నారు. ఘోష్ ఎయిర్‌లైన్‌లో 10 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఝున్‌ఝున్‌వాలా చరిష్మా సలహాలు, ఫండ్ పుల్లింగ్ సామర్థ్యాలు ఆకాశకు ఇకపై అందుబాటులో లేనప్పటికీ, ఆకాశ అభివృద్ధి చెందుతుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఆ మేరకు ఆయన సంస్థను కట్టుదిట్టం చేశారన్నారు. ఇండియా జనాభా, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఏవియేషన్‌ పరిశ్రమ వృద్ధిపై ఆయన విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక ఆకాశ ఎయిర్‌ అని అన్నారు.

అక్టోబర్ 11న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోటర్‌గా ఉన్న 'ఆకాశ ఎయిర్' అల్ట్రా-లో కాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి.  జులై 7న సేవలు ప్రారంభించేందుకు 'డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌' నుంచి 'ఆపరేటర్‌ సర్టిఫికేట్‌' పొందింది. ఆకాశ ఎయిర్‌ ఆగస్టు 7న తొలి సర్వీసును నడిపింది.   ఈ క్రమంలోనే ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు19న బెంగళూరు-ముంబై,సెప్టెంబరు 15న చెన్నై-ముంబైకు తన విమాన సేవల్ని   అందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు