మార్కెట్ల కరెక్షన్‌- జున్‌జున్‌వాలాకు షాక్‌

24 Sep, 2020 12:33 IST|Sakshi

ఆరు రోజులుగా పతన బాటలో మార్కెట్లు

6 శాతం చొప్పున క్షీణించిన సెన్సెక్స్‌, నిఫ్టీ

రాకేష్‌ జున్‌జున్‌వాలా ఫేవరెట్‌ స్టాక్స్‌ పతనం

24-10 శాతం మధ్య నష్టపోయిన పలు షేర్లు

గత ఆరు రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌ బాటలో సాగుతున్నాయి. తాజాగా సెన్సెక్స్‌ 700 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా కోల్పొయింది. వెరసి గత ఆరు రోజుల్లో ప్రామాణిక ఇండెక్సులు సగటున 6 శాతం స్థాయిలో నీరసించగా.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని కొన్ని షేర్లు ఇంతకంటే అధికంగా పతనమయ్యాయి. వివరాలు చూద్దాం..

జాబితా ఇలా
రాకేష్‌ ఫేవరెట్లుగా భావించే పలు కంపెనీల షేర్లు ఇటీవల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జాబితాలో ఎడిల్‌వీజ్‌, డిష్‌మన్‌ కార్బొజెన్‌, ఎస్కార్ట్స్‌ తదితరాలున్నాయి. ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో రాకేష్‌కు 1.19 శాతం వాటా ఉంది. తాజాగా ఈ షేరు 5 శాతం పతనమై రూ. 56ను తాకింది. వెరసి ఈ నెల 16 నుంచి చూస్తే 24 శాతం క్షీణించింది. 

ఇతర కౌంటర్లలో
జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని ఇతర కౌంటర్లలో డిష్‌మన్‌ కార్బోజెన్‌ అమిక్స్‌ 18 శాతం నష్టపోయింది. ఈ కంపెనీలో 3.18 శాతం వాటాను రాకేష్‌ కలిగి ఉన్నారు. ఇదే విధంగా 6.48 శాతం వాటా కలిగిన ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌ గత ఆరు రోజుల్లో 17 శాతం తిరోగమించింది. ఇక కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ కౌంటర్‌ అయితే వరుసగా 8వ రోజూ డీలా పడింది. 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, మంధన రిటైల్‌, అయాన్‌ ఎక్స్ఛేంజ్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ కౌంటర్లు సైతం 10 శాతంపైగా నష్టపోవడం గమనార్హం!

ఫేవరెట్లు వీక్‌
రాకేష్‌కు ఇష్టమైన టైటన్‌ కంపెనీ షేరు గత ఆరు రోజుల్లో 7 శాతం వెనకడుగు వేసింది. ఈ టాటా గ్రూప్‌ కంపెనీలో రాకేష్‌కు రూ. 5,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులున్నాయి. ఇక రూ. 1,000 కోట్ల విలువైన వాటా కలిగిన ఎస్కార్ట్స్‌ 5 శాతం నీరసించింది. ఇదేవిధంగా క్రిసిల్‌, లుపిన్‌ 3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి.

మరిన్ని వార్తలు