నిన్న ప్రధానితో నేడు ఆర్థిక మంత్రితో ఝున్‌ఝున్‌వాలా భేటీ, నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటీ ?

6 Oct, 2021 16:55 IST|Sakshi

Rakesh Jhunjhunwala : ఇండియన్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటీ అనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధారణంగా రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మార్కెట్‌ స్ట్రాటజీలపై దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తుంటారు. కానీ గత రెండు రోజులుగా ప్రధాని, ఆర్థిక మంత్రులను ఆయన కలుసుకోవడం చర్చకు దారి తీసింది.

మార్కెట్‌ వ్యవహరాలు తప్పితే పెద్దగా ఇతర విషయాల్లో నేరుగా తల దూర్చని రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా తన శైలికి భిన్నంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ వెంటనే బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. వరుసగా రెండు రోజుల పాటు హై ప్రొఫైల్‌ సమావేశాల్లో ఆయన పాల్గొనడం వెనుక ఆంతర్యం ఏంటనే కూపి లాగుతున్నాయి వ్యాపార వర్గాలు. మరోవైపు ఝున్‌ఝున్‌వాలాతో భేటీ విషయాలను ప్రధానిమోదీ, మంత్రి నిర్మలా సీతారామన్‌లు నేరుగా సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్‌ చేశారు. కానీ భేటీలో ప్రస్తావించిన అంశాలను తెలపడం లేదు. 

స్టాక్‌మార్కెట్‌లో దేశీ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు ఆల్‌టైం హై దగ్గర ట్రేడవుతున్నాయి. ఏషియా మార్కెట్లు నష్టాలు చవి చూస్తున్నా.. దేశీ మార్కెట్లు నిలకడగా ఉంటూ బుల్‌ జోరుని కొనసాగిస్తున్నాయి. మరోవైపు జీ షేర్ల విషయంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందనే ఆరోపణలు రాకేశ్‌ చుట్టూ ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బుల్‌ ప్రధాని, ఆర్థిక మంత్రితో జరిపిన సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా త్వరలో ఆకాశ పేరుతో ఎయిర్‌లైన్స్‌ సేవలు ప్రారంభించే యోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సహాకారం కోరేందుకు వచ్చి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బిగ్‌బుల్‌ ఇచ్చే మార్కెట్‌ సూచనల కోసం దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. విదేశీ మార్కెట్ల కంటే స్వదేశీ మార్కెట్ల ద్వారానే ఎక్కువ లాభపడవచ్చంటూ ఆయన తరచుగా ఔత్సాహిక ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటారు. 

చదవండి: నలిగిన చొక్కాతో ఝున్‌ఝున్‌వాలా.. గౌరవంగా మోదీ

>
మరిన్ని వార్తలు